‘కుంబ్లేను చీఫ్‌ సెలక్టర్‌గా చూస్తాం!’

Virender Sehwag Interesting Comments On Anil Kumble - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా లెజండరీ బౌలర్‌, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లేను భవిష్యత్‌లో జాతీయ చీఫ్‌ సెలక్టర్‌గా చూస్తామని మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ జోస్యం చెప్పాడు. ఆ పదవికి కుంబ్లే అన్ని విధాల అర్హుడని స్పష్టం చేశాడు. బుధవారం ఓ సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘2007-08లో ఆస్ట్రేలియా సిరీస్‌కు తిరిగి టీమిండియాకు ఎంపికయ్యాను. మ్యాచ్‌ రోజు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న నా దగ్గరికి వచ్చి ఇంకో  రెండు సిరీస్‌ల వరకు నువ్వు జట్టుతోనే ఉంటావు. స్వేచ్చగా ఆడు.. అంటూ ప్రొత్సహించాడు. ఇలా ఓ ఆటగాడిపై సారథిగా అంత కాన్ఫిడెంట్‌ ఉండటం మామూలు విషయం కాదు. ఇక సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ వంటి దిగ్గజాలతో ఆడాడు, అదేవిధంగా యువ క్రికెటర్లను ఎంతగానో ప్రొత్సహిస్తున్నాడు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి కుంబ్లేను సెలక్టర్‌గా చూడటానికి?

నన్ను ఎవరూ కోరలేదు
2017లో బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి నన్ను ప్రత్యేకంగా కోరడంతోనే కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేశాను. కానీ ఈ సారి ఎవరూ నన్ను అడగలేదు అందుకే దరఖాస్తు చేయలేదు. ఇక ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోనిని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే మ్యాచ్‌ సమీకరణాలు వేరేలా ఉండేవి. అయితే ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కొన్ని వ్యూహాలు బెడిసికొడతాయి. ఇక శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేయడం సంతోషకరం. త్వరలో టీమిండియా తరుపున ఆడాలని ఆకాంక్షిస్తున్నా’అంటూ సెహ్వాగ్‌ వివరించాడు. 

ఇక ప్రస్తుత సెలక్షన్‌ బృందంపై అన్ని వైపులా విమర్శలు వస్తున్న తరుణంలో సెహ్వాగ్‌ వ్యాఖ్యలు ఆసక్తి నెలకొన్నాయి. ప్రస్తుతమున్న సెలక్టర్లలో ఒక్కరు కూడా సుదీర్ఘ కాలం క్రికెట్‌ ఆడిన వారు కాదని, 15కి మించి వన్డే/టెస్టులు ఆడలేదని మాజీ క్రికెటర్లు విమర్శించిని విషయం తెలిసిందే. దీంతో సెలక్టర్ల కాంట్రాక్టు ముగుస్తున్న తరుణంలో బీసీసీఐ వారిని కొనసాగిస్తుందా లేదా వేరే ఎవరైనా దిగ్గజాలకు అవకాశం కల్పిస్తుందా అనేది వేచి చూడాలి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top