ఇంత చెత్తగా ఆరంభిస్తాం అనుకోలేదు: కోహ్లి

Virat Kohli Says A Scrappy Start To The League - Sakshi

చెన్నై : చెన్నైసూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)తో జరిగిన ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో తమ ఓటమికి చెత్త బ్యాటింగే కారణమని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ.. ‘ఎవరూ ఇలా ఆరంభించాలనుకోరు. కానీ మా పోరాటం సంతోషాన్నిచ్చింది. అతి స్వల్ప స్కోర్‌ను కాపాడుకుంటూ మ్యాచ్‌ను 18వ ఓవర్‌ వరకు తీసుకెళ్లడం ఆకట్టుకుంది. బ్యాటింగ్‌ మాత్రం చాలా దారుణంగా చేశాం. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. గాల్లోని తేమను చూసి తొలుత 140-150 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశిస్తామనుకున్నా. కానీ అది కుదరలేదు. లీగ్‌ను చాలా చెత్తగా ఆరంభించాం. ఈ ఓటమి నుంచి జట్టు తేరుకుంటుందా? లేదా? అని ఆలోచించడం లేదు. గత నాలుగు రోజులగా ఈ పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. ఏది ఏమైనప్పటికీ మేం బ్యాటింగ్‌ బాగా చేయాల్సింది. కనీసం 110 నుంచి 120 పరుగులు చేసినా పోరాడటానికి వీలుండేది. మా పేసర్‌ నవదీప్‌ షైనీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. సీఎస్‌కే మా కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చింది. వారు ఈ విజయానికి అర్హులు. కానీ మా జట్టు పోరాట స్పూర్తి ఆకట్టుకుంది.

మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. పార్థివ్‌ పటేల్‌ (35 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌. హర్భజన్, ఇమ్రాన్‌ తాహిర్‌ చెరో 3 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి. తర్వాత చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (42 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. హర్భజన్‌ సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top