ఆసియాకప్‌: విరాట్‌ కోహ్లికి విశ్రాంతి!

Virat Kohli Might Be Rested For Asia Cup - Sakshi

న్యూఢిల్లీ : మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే ఆసియాకప్‌ కోసం టీమిండియా సెలక్టర్లు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌.. మరో రెండు వారాల్లో ఆసియాకప్‌కు సిద్దం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. వరుస మ్యాచ్‌లతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. దీంతో అతనికి విశ్రాంతి ఇచ్చే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జట్టు బ్యాటింగ్‌ భారన్ని కోహ్లినే మోయడం.. రెండో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడటం సెలక్టర్లను కలవరపెడుతోంది. అంతేకాకుండా ఆసియాకప్‌ టోర్నీ అనంతరం భారత్‌ మరో ఆరుటెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా కోహ్లికి విశ్రాంతి ఇవ్వడమే మేలు అని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆసియాకప్‌లో జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్‌ శర్మ నిర్వహించనున్నాడు. అయితే ఈ టోర్నీలో దాయాదీ పాకిస్తాన్‌తో రెండు లేదా మూడు మ్యాచ్‌లు భారత్‌ ఆడే అవకాశం ఉంది. కాబట్టి సినియర్‌ ప్లేయర్లు పక్కన పెడితే పెద్ద సమస్య ఎదురవుతోందనే చర్చ కూడా జరుగుతోంది.

మిడిలార్డర్‌లో ప్రయోగాలు చేసే అవకాశం కూడా ఉంది. ఓపెనర్లుగా శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలున్నారు. వీరికి బ్యాకప్‌గా కేఎల్‌ రాహుల్‌, లేకుంటే జట్టు పరిస్థితిని బట్టి వన్‌డౌన్‌లో దింపే అవకాశం ఉంది. ఇక ప్రపంచకప్‌ దృష్ట్యా కోహ్లికి మద్దతుగా ఉండేలా మిడిలార్డర్‌ను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. భారత్‌-బి, భారత్‌-ఏ జట్ల తరపున రాణించిన మనీష్‌ పాండే, అంబటి రాయుడులను పరీక్షించే అవకాశం ఉంది. ఇక గాయంతో జట్టుకు దూరమైన కేదార్‌జాదవ్‌ కూడా కోలుకున్నాడు. మయాంక్‌ అగర్వాల్‌ను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటక, భారత్‌ ఏ తరపున అగర్వాల్‌ అద్భుతంగా రాణించాడు. కానీ అతనికి రాహుల్‌, ధావన్‌, రోహిత్‌ల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. రాహుల్‌కు విశ్రాంతిస్తే అగర్వాల్‌కు అవకాశం రానుంది. ఇక బౌలింగ్‌ విభాగంలో గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌, బుమ్రాలు లీడ్‌ చేసే అవకాశం ఉంది. ఇక ధోనికి బ్యాకప్‌గా రిషబ్‌ పంత్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత టెస్టు సిరీస్‌ ఈ యువ ఆటగాడు రాణిస్తున్నాడు. సెప్టెంబర్‌ 15 నుంచి దుబాయ్‌, అబుదాబి వేదికగా ఆసియా కప్‌ ప్రారంభం కానుంది.

చదవండి: 86/6 నుంచి 246 వరకు...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top