ఆఖరి పోరాటం  | Today India and Australia are the fifth ODI | Sakshi
Sakshi News home page

ఆఖరి పోరాటం 

Mar 13 2019 12:44 AM | Updated on Mar 13 2019 5:05 AM

Today India and Australia are the fifth ODI - Sakshi

సొంతగడ్డపై 2–0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్‌ విజయం కోసం చివరి మ్యాచ్‌ దాకా పోరాడాల్సి ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆస్ట్రేలియా స్ఫూర్తిదాయక ఆటతో పోరులో నిలిచింది. ఇప్పటి వరకు అత్యంత పటిష్టమైనదిగా భావిస్తూ వచ్చిన మన బౌలింగ్‌ బలగాన్ని కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఊచకోత కోయగలరని మొహాలీ వన్డే నిరూపిస్తే... పరిష్కారమైపోయిందనుకున్న ‘నంబర్‌ 4’ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రాబోయే ఐపీఎల్‌ టి20 ప్రాక్టీస్‌ను పక్కన పెడితే వరల్డ్‌ కప్‌కు ముందు టీమిండియా  చివరి సారిగా వన్డే బరిలోకి దిగబోతోంది. ఇదే కూర్పు విశ్వ వేదికపై కొనసాగడం ఖాయం కాకపోయినా, తమ సత్తాను పరీక్షించుకునేందుకు టీమ్‌కు...జట్టులో మిగిలిన ఒకటి, రెండు స్థానాల కోసం పోటీ పడుతున్న ఆటగాళ్లకు ఇదే ఆఖరి అవకాశం. అటు ఆసీస్‌ కూడా అనూహ్యంగా పుంజుకోవడంతో చివరి మ్యాచ్‌లో రసవత్తర పోరు ఖాయమనిపిస్తోంది.   

న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఇదే చివరిది కానుంది. మారిన ఐసీసీ నిబంధనల ప్రకారం 2020 మే నుంచి ఏ రెండు జట్ల మధ్య కూడా మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరగదు. ఆసీస్‌తో స్వదేశంలో వరుసగా మూడు వన్డే సిరీస్‌లను నెగ్గిన టీమిండియా అదే రికార్డును కొనసాగిస్తూ మరో సిరీస్‌ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంటే... గత మ్యాచ్‌లో విజయం తర్వాత ఆసీస్‌లో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా నేడు జరిగే ఐదో వన్డేలో తలపడేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి.  

మార్పుల్లేకుండానే... 
సిరీస్‌లో మూడు వన్డేల తర్వాత గత మ్యాచ్‌లో భారత్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. కాబట్టి వెంటనే మార్పు చేయకుండా అదే జట్టు కొనసాగించవచ్చు. వికెట్‌ కీపింగ్‌లో ఇబ్బంది పడ్డా, రిషభ్‌ పంత్‌ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. భువనేశ్వర్, చహల్‌ కూడా భారీగా పరుగులిచ్చినా వారిపై మేనేజ్‌మెంట్‌కు నమ్మకముంది. అయితే నాలుగో స్థానంలో ఆడిన లోకేశ్‌ రాహుల్‌ విషయంలో మాత్రం చర్చ ఖాయం. అంబటి రాయుడుకు బదులుగా వచ్చిన రాహుల్‌ పెద్దగా రాణించలేదు. ఇన్నింగ్స్‌ ఆసాంతం ఆత్మవిశ్వాసం లోపించినట్లు తడబడుతూనే ఆడాడు. అయితే వరల్డ్‌ కప్‌ ప్రాబబుల్స్‌లో ఒకడిగా ఉన్న అతడిని ఒకే మ్యాచ్‌ తర్వాత తప్పించే అవకాశం తక్కువ. ఈసారైనా అతను అంచనాలను అందుకుంటాడా చూడాలి. మరోవైపు మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతున్న విజయ్‌ శంకర్‌ను నాలుగో స్థానంలో ప్రయత్నించే అవకాశాలు కూడా తీసిపారేయలేం. ఇక నాగపూర్‌ వన్డే మినహా మిగిలిన మూడు మ్యాచుల్లో 60, 53, 63 పరుగుల చొప్పున ఇచ్చిన బుమ్రా ఆట కూడా పదునెక్కాల్సి ఉంది. 358 పరుగులు చేసిన జట్టు బ్యాటింగ్‌ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఓపెనర్లతో పాటు కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోగా... ఆ తర్వాత వచ్చే పంత్, కేదార్‌ జాదవ్‌ కూడా అదనపు పరుగులు జోడించాల్సి ఉంది. చాలా కాలం తర్వాత జంటగా విఫలమైన కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌ చెలరేగితే మ్యాచ్‌ మన వైపు మొగ్గుతుంది.  

తుది జట్లు (అంచనా)  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, పంత్, జాదవ్, విజయ్‌ శంకర్, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. 
ఆస్ట్రేలియా: ఫించ్, ఖాజా, మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, టర్నర్, కారీ, రిచర్డ్సన్, కమిన్స్, జంపా, బెహ్రన్‌డార్ఫ్‌/లయన్‌. 

పిచ్, వాతావరణం  
ఫిరోజ్‌ షా కోట్లా వికెట్‌ నెమ్మదిగానే ఉంటుంది. ఇక్కడ జరిగిన గత రెండు వన్డేల్లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. టాస్‌ కీలకం కానుంది. మ్యాచ్‌ రోజు ఢిల్లీలో మేఘావృతంగా ఉండబోతున్నా వర్షం తో ఆటకు అంతరాయం కలిగే అవకాశం తక్కువ.  
 

జోరు మీదున్న  కంగారూలు
చాలా రోజులుగా తమ బ్యాటింగ్‌పై తీవ్రంగా ఆందోళన చెందిన ఆస్ట్రేలియాకు మొహాలీ మ్యాచ్‌ తర్వాత కొంత ఊరట లభించిందనేది వాస్తవం. రేపు వార్నర్, స్మిత్‌ వస్తే జట్టులోంచి చోటు కోల్పోయే అవకాశం ఉన్న ఖాజా, హ్యాండ్స్‌కోంబ్‌ ఈ సిరీస్‌లో సెంచరీలతో తమ సత్తా చాటడం విశేషం. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ ఎలాగూ ఉన్నాడు. ఇదే మైదానంలో ఐపీఎల్‌ అనుభవం ఎక్కువగా ఉన్న మ్యాక్సీ మళ్లీ బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోగలడు. మంగళవారం జరిగిన ప్రాక్టీస్‌ను బట్టి చూస్తే స్టొయినిస్‌ గాయం నుంచి కోలుకున్నట్లే కనిపించాడు. అయితే అతని స్థానంలో వచ్చి నాలుగో వన్డేలో అద్భుత ఆటతో గెలిపించిన టర్నర్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. అతను మళ్లీ చెలరేగగలడా చూడాలి. కానీ స్టొయినిస్‌ లేకపోవడంతో గత మ్యాచ్‌లో ఆసీస్‌ ఐదో బౌలర్‌ కొరతను ఎదుర్కొని భారీగా పరుగులు సమర్పించుకుంది. చివరకు ఫించ్‌ కూడా బౌలింగ్‌ వేయాల్సి వచ్చింది. ఈ సమస్యను జట్టు ఎలా అధిగమిస్తుందనేది కీలకం. రాంచీలో చక్కటి ప్రదర్శన తర్వాత డకౌట్‌ అయిన ఫించ్, వరుసగా మూడు మ్యాచుల్లోనూ విఫలమైన షాన్‌ మార్‌‡్ష కూడా రాణించాలని జట్టు కోరుకుంటోంది. చివరి మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో ఆడిన కంగారూలు పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.   

►25 1982లో తొలి వన్డేకు ఆతిథ్యం ఇచ్చిన ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో ఇది 25వ వన్డే. ఈ మైదానంలో భారత్‌ 12 మ్యాచ్‌లు గెలిచి, 6 ఓడింది. వీటిలో ఆస్ట్రేలియాపై 3 గెలిచి, 1 మ్యాచ్‌లో ఓడింది.   

ఈ సిరీస్‌లో ఉన్న విధంగానే ప్రపంచ కప్‌లో కూడా జట్టు కూర్పు ఉండాలని లేదు. మేం వేర్వేరు సందర్భాల్లో ఆటగాళ్లు ఎలా ఆడగలరో ప్రయత్నిస్తున్నామంతే. మెగా టోర్నీకి ముందు అన్ని విధాలా పక్కాగా ఉండాలనేదే మా ఆలోచన. గత మ్యాచ్‌లో ఓటమి కూడా మంచికే జరిగింది. వరల్డ్‌ కప్‌లోగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా లోపాలు సరిదిద్దుకునే అవకాశం కలిగింది. ధోనిలాంటి దిగ్గజంతో పంత్‌ను పోల్చడం తప్పు. ఏ స్థానంలోనైనా బాగా బ్యాటింగ్‌ చేస్తున్న విజయ్‌ శంకర్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అతని బౌలింగ్‌ కూడా మెరుగవడం జట్టుపరంగా సానుకూల పరిణామం. రాంచీ మ్యాచ్‌లో క్యాప్‌లు ధరించడంలో మా ఉద్దేశం మన ఆర్మీకి సంఘీభావం ప్రకటించడమే. మేం ఐసీసీ అనుమతి తీసుకున్నాం కాబట్టి పాక్‌ బోర్డు ఏం చెప్పినా మాకు సంబంధం లేదు.                                                  
– భరత్‌ అరుణ్, భారత బౌలింగ్‌ కోచ్‌    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement