గోమతి, తేజిందర్‌లకు స్వర్ణాలు

Tajinderpal Singh Toor, Gomathi Marimuthu clinch gold, MP Jabir secures bronze - Sakshi

ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌  

దోహా: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోమతి మరిముత్తు... తనపై పెట్టుకున్న ఆశలను నిజం చేస్తూ తేజిందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మెరిశారు. మహిళల 800 మీటర్ల రేసులో 30 ఏళ్ల గోమతి... పురుషుల షాట్‌పుట్‌ ఈవెంట్‌లో 24 ఏళ్ల తేజిందర్‌ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. చెన్నైకు చెందిన గోమతి 800 మీటర్ల రేసును 2 నిమిషాల 02.70 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన తేజిందర్‌ అదే జోరును ఇక్కడ కూడా కనబరిచి విజేతగా నిలిచాడు. పంజాబ్‌కు చెందిన తేజిందర్‌ ఇనుప గుండును 20.22 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు.
 

ఓవరాల్‌గా రెండో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలతో కలిపి ఐదు పతకాలు వచ్చాయి. మహిళల 100 మీటర్ల రేసును భారత స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ 11.44 సెకన్లలో ముగించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.  పురుషుల జావెలిన్‌ త్రోలో బరిలోకి దిగిన శివ్‌పాల్‌ సింగ్‌ రజతం దక్కించుకున్నాడు. శివ్‌పాల్‌ జావెలిన్‌ను 86.23 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సరితాబెన్‌ గైక్వాడ్‌ 57.22 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జాబిర్‌ 49.13 సెకన్లతో కాంస్య పతకాన్ని నెగ్గాడు. తొలి రోజు ఆలస్యంగా జరిగిన పురుషుల 10,000 మీటర్ల రేసులో మురళీ కుమార్‌ (28ని:38.34 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top