రైనా పునరాగమనం | Suresh Raina Returns as India Name 16-man Squad for South Africa T20Is | Sakshi
Sakshi News home page

రైనా పునరాగమనం

Jan 29 2018 4:44 AM | Updated on Jan 29 2018 4:44 AM

Suresh Raina Returns as India Name 16-man Squad for South Africa T20Is - Sakshi

సురేశ్‌ రైనా

ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టి20ల సిరీస్‌ కోసం ఆదివారం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా దాదాపు ఏడాది తర్వాత తిరిగి ఎంపిక కావడం విశేషం. గత ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో ఆఖరి టి20 ఆడిన రైనా... ఫిట్‌నెస్‌ సమస్యలతో పాటు ఫామ్‌ కోల్పోయి టీమ్‌కు దూరమయ్యాడు. అనంతరం ‘యోయో టెస్టు’లో కూడా సఫలమైన అతను ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో చెలరేగాడు. ఈ టోర్నమెంట్‌లో రైనా ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. కోహ్లి సారథ్యంలో 16 మంది సభ్యుల టీమ్‌లో అక్షర్‌ పటేల్, పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌లకు కూడా అవకాశం లభించింది. భారత్‌ తరఫున 2 వన్డేలు ఆడిన శార్దుల్‌కు టి20 పిలుపు లభించడం ఇదే తొలిసారి.  

శ్రేయస్‌ అయ్యర్‌పైనా వేటు...:
ఇటీవల శ్రీలంకతో సిరీస్‌లో కెప్టెన్‌ కోహ్లి సహా పలువురు కీలక ఆటగాళ్లకు భారత్‌ విశ్రాంతినిచ్చింది. వారందరూ ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చారు. ఫలితంగా బాసిల్‌ థంపి, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌ చోటు కోల్పోయారు. లంకతో ఒక మ్యాచ్‌ ఆడిన హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌పై కూడా వేటు పడింది. మరోవైపు ముంబై యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను కూడా జట్టు నుంచి తప్పించారు. శ్రీలంకతో మూడు వన్డేల్లో రెండు అర్ధ సెంచరీలు చేసి ఆకట్టుకున్న అయ్యర్‌... ఆ తర్వాత మూడు టి20ల్లో కలిపి 54 పరుగులే చేయగలిగాడు. ఇటీవల పంజాబ్‌తో జరిగిన ముస్తాక్‌ అలీ టోర్నీ మ్యాచ్‌లో 44 బంతుల్లో 79 చేసినా...సెలక్టర్లు దీనిని పరిగణలోకి తీసుకోకుండా అయ్యర్‌ను తప్పించారు. వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.  

భారత టి20 జట్టు వివరాలు:
కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), ధావన్, రాహుల్, రైనా, ధోని, దినేశ్‌ కార్తీక్, పాండ్యా, మనీశ్‌ పాండే, అక్షర్‌ పటేల్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, జైదేవ్‌ ఉనాద్కట్, శార్దుల్‌ ఠాకూర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement