రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి

Steyn Back To South Africa ODI Squad After Two Years - Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ నెల 30 నుంచి జింబాబ్వేతో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌ కోసం ఎంపిక చేసిన 16 మంది ఆటగాళ్ల జాబితాలో స్టెయిన్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. గత కొద్ది నెలలుగా గాయాలతో సతమతమవుతున్న ఈ స్సీడ్‌ గన్‌ శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. అయితే 2019 ప్రపంచకప్‌ దృష్ట్యా జింబాబ్వే సిరీస్‌కు 35 ఏళ్ల స్టెయిన్‌ను  పరీక్షించడానికి సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. స్టెయిన్‌ ఫిట్‌నెస్‌, ప్రపంచకప్‌ వరకు ఆడగలడా వంటివి పరీక్షించే అవకాశం వుంది.

‘జింబాబ్వే సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, శ్రీలంకతో కీలక సిరీస్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌లతో ప్రపంచకప్‌ కోసం బలమైన జట్టును తయారు చేసుకోవచ్చు. అన్ని రకాలు ప్రయోగాలు చేసాం. ఎవర ప్రపంచకప్‌ వరకు ఆడే సత్తా ఉందో ఈ సిరీస్‌లతో తేలిపోతుంది. కెప్టెన్‌ డుప్లెసిస్‌కు శ్రీలంకతో సిరీస్‌ సందర్భంగా భుజానికి గాయమైంది. జింబాబ్వే సిరీస్‌ ప్రారంభం వరకు కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఒక వేళ కోలుకోకుంటే ఆ సిరీస్‌కు నాయకత్వం వహించేది ఎవరనేది త్వరలో చెపుతాం’ అంటూ దక్షిణాఫ్రికా సెలక్షన్‌ కన్వీనర్‌ లిండా జోండి తెలిపారు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top