మనోహర్‌ మరోసారి... 

Shashank Manohar re-elected  independent ICC - Sakshi

ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవ ఎంపిక

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. తొలి స్వతంత్ర చైర్మన్‌గా 2016లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన రెండోసారి కూడా ఎలాంటి పోటీ లేకుండా ఎంపిక కావడం విశేషం. ఐసీసీ డైరెక్టర్లందరూ మరో మాటకు తావు లేకుండా శశాంక్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. ఫలితంగా ఒక్క మనోహర్‌ నామినేషన్‌ మాత్రమే రావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ ప్రకటించింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన మనోహర్, గత రెండేళ్ల కాలంలో ఐసీసీలో సమర్థంగా పని చేస్తూ పలు సంస్కరణలు చేపట్టారు. ‘ఐసీసీ చైర్మన్‌గా మళ్లీ ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. వచ్చే రెండేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఐసీసీ సభ్యులందరితో కలిసి పని చేస్తాం. ప్రస్తుతం క్రికెట్‌ ఉచ్ఛ స్థితిలో ఉంది. దీనిని ఇలాగే కొనసాగించేందుకు శ్రమించాల్సి ఉంది’ అని శశాంక్‌ మనోహర్‌ వ్యాఖ్యానించారు.  

ఐసీసీ–బీసీసీఐ అధికారుల భేటీ!  
టెస్టు క్రికెట్‌ భవిష్యత్తు సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు బీసీసీఐ అధికారులతో ఐసీసీ బృందం గురువారం భేటీ కానుంది. ఐసీసీ నిబంధనలు రూపొందించే వర్కింగ్‌ గ్రూప్‌ వాటిపై సభ్య దేశాల అభిప్రాయాలు తెలుసుకుంటుంది. ఇందులో భాగంగానే ఈ సమావేశం జరుగనుంది. బోర్డు తరఫున తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరి, సీఈఓ రాహుల్‌ జోహ్రి దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. త్వరలో టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుందని ఇటీవల బ్రెండన్‌ మెకల్లమ్‌ చేసిన వ్యాఖ్యలు, కుర్రాళ్లు దేశం తరఫున టెస్టు ఆడటంకంటే టి20 లీగ్‌లకే ప్రాధాన్యత ఇస్తుండటం, డే అండ్‌ నైట్‌ టెస్టుల నిర్వహణ తదితర అంశాలపై బీసీసీఐ తమ అభిప్రాయాలు, సూచనలు ఐసీసీ బృందానికి వెల్లడిస్తుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top