
ఢాకా: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్‌లో మరో భారీ విజయం సాధించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 7–0తో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో భారత్ 5–1తో జపాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్‌కు ఏ దశలోనూ బంగ్లాదేశ్ నుంచి పోటీ ఎదురుకాలేదు. అవకాశం దొరికినపుడల్లా బంగ్లాదేశ్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసిన భారత్ క్రమం తప్పకుండా గోల్స్ సాధించింది. భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (7వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (10వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (13వ ని.లో), అమిత్ రోహిదాస్ (20వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (46వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హర్మన్‌ప్రీత్ సింగ్ (28వ, 47వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు.
మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 13 పెనాల్టీ కార్నర్‌లు రాగా... రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలిచారు. లేదంటే టీమిండియాకు మరింత భారీ విజయం దక్కేది. మరోవైపు పాకిస్తాన్, జపాన్ జట్ల మధ్య జరిగిన పూల్ ‘ఎ’ మరో లీగ్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది.