కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ  | Satwik-Chirag Achieved Best Career Best Ranking Of No 7 | Sakshi
Sakshi News home page

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 

Nov 13 2019 4:51 AM | Updated on Nov 13 2019 4:51 AM

Satwik-Chirag Achieved Best Career Best Ranking Of No 7 - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)–చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర) జంట తమ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తాజా ర్యాంకింగ్స్‌లో.... గతవారం చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో సెమీస్‌ చేరిన సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిది నుంచి ఏడో ర్యాంక్‌కు చేరుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ షట్లర్‌గా హైదరాబాద్‌ ప్లేయర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ అవతరించాడు. సాయిప్రణీత్‌ ఒక స్థానం పురోగతి సాధించి పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాయిప్రణీత్‌ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్‌ కావడం విశేషం. ఇప్పటిదాకా పదో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా ఉన్న కిడాంబి శ్రీకాంత్‌ మూడు స్థానాలు పడిపోయి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో టాప్‌–50లో ఎనిమిది మంది భారత ఆటగాళ్లు ఉండటం విశేషం. సమీర్‌ వర్మ (16వ స్థానం), కశ్యప్‌ (25వ), ప్రణయ్‌ (28వ), సౌరభ్‌ వర్మ (38వ), లక్ష్య సేన్‌ (42వ), శుభాంకర్‌ డే (44వ స్థానం) టాప్‌–50లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఆరో ర్యాంక్‌లో, సైనా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement