హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ పాఠశాల బాలికల క్రికెట్ టోర్నమెంట్‌లో సరూర్‌నగర్ జెడ్పీహెచ్‌ఎస్ చాంపియన్‌గా నిలిచింది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ పాఠశాల బాలికల క్రికెట్ టోర్నమెంట్‌లో సరూర్‌నగర్ జెడ్పీహెచ్‌ఎస్ చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జడ్పీహెచ్‌ఎస్ బాలికల జట్టు 43 పరుగుల తేడాతో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌పై ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన జడ్పీహెచ్‌ఎస్ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. అనిత (50) అర్ధసెంచరీతో చెలరేగింది. ఫ్రాన్సిస్ జట్టు బౌలర్లలో అరుణ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం సెయింట్ ఫ్రాన్సిస్ జట్టు 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసి ఓడిపోయింది. జడ్పీహెచ్‌ఎస్ బౌలర్ కల్పన 2 వికెట్లతో రాణించింది. మ్యాచ్ అనంతరం మహిళా క్రికెట్ సంఘం అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ విజేతలకు ట్రోఫీని అందజేశారు.