సైనా... 12వ‘సారీ’ | Saina nehwal exits French Open badminton | Sakshi
Sakshi News home page

సైనా... 12వ‘సారీ’

Oct 27 2018 5:01 AM | Updated on Oct 27 2018 5:01 AM

Saina nehwal exits French Open badminton - Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ సైనా 20–22, 11–21తో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది. తై జు యింగ్‌ చేతిలో సైనాకిది వరుసగా 12వ పరాజయం కావడం విశేషం. గత ఆదివారం డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్లోనూ తై జు చేతిలో సైనా ఓడిన సంగతి తెలిసిందే. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సైనా 20–16తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. రెండో గేమ్‌లో ఈ భారత స్టార్‌ పూర్తిగా చేతులెత్తేసింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–17, 21–11తో సుమీత్‌ రెడ్డి–మను అత్రి (భారత్‌) జోడీపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం క్వార్టర్‌ ఫైనల్లో సుమీత్‌–మను అత్రి జంట 21–16, 21–14తో ప్రపంచ ఐదో ర్యాంక్‌ జోడీ లియు చెంగ్‌–నాన్‌ జాంగ్‌ (చైనా)పై సంచలన విజయం సాధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement