ముగిసిన విజయన్‌ శకం | Pinarayi Vijayan Steps Down As Kerala CM After Poll Defeat | Sakshi
Sakshi News home page

ముగిసిన విజయన్‌ శకం

May 5 2026 8:07 AM | Updated on May 5 2026 8:46 AM

Pinarayi Vijayan Steps Down As Kerala CM After Poll Defeat

తిరువనంతపురం: కేరళ రాజకీయ చరిత్రలో 2026 మే 4 తేదీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి ఓటమి చవిచూడగా.. రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరైన పినరయి విజయన్‌ కూడా ఒక మలుపుగా నిలుస్తుంది. వరుసగా 16 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం కూటమికి, అలాగే, వరుసగా రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయన్‌కు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. 

81 ఏళ్ల విజయన్, ఒక సామాన్య కార్మిక వర్గ నేపథ్యం నుంచి కేరళకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆయన తిరుగులేని అధికార కేంద్రంగా ఎదిగారు. గత దశాబ్ద కాలంగా పార్టీని, ప్రభుత్వాన్ని తిరుగులేకుండా నడిపించారు. ఆయన నేతృత్వంలో సీపీఎం కూడా తన పాత నాయకత్వ పద్ధతి నుంచి క్రమంగా వైదొలుగుతూ సామాజిక మార్పును సంతరించుకుంది.

క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరుగాంచిన విజయన్‌.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తన సుదీర్ఘ పదవీకాలంలో కఠినమైన నిర్వాహకుడిగా పేరు సంపాదించారు. 2026లో, విజయన్‌ వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలనే అరుదైన ప్రయత్నంలో, వామపక్షాలకు నాయకత్వం వహించి మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. కానీ ఈసారి పరిస్థితి తారుమారైంది. ఆయన సొంత జిల్లా అయిన కన్నూర్‌లోని తమ సంప్రదాయ కంచుకోటతో సహా పలుచోట్ల సీపీఎం నేతృత్వంలోని కూటమి పట్టు కోల్పోయింది.

ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని... 
’దృఢమైన పరిపాలనా పట్టుకలిగిన కఠినమైన కమ్యూనిస్ట్‌’గా వర్ణించబడే విజయన్‌.. రాజకీయ సంప్రదాయాలను బద్దలు కొడుతూ, 16 ఏళ్లపాటు పారీ్టకి, వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రానికి నాయకత్వం వహించి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నారు. 

చేనేత కార్మికుడిగా... 
విజయన్‌ 1944లో కన్నూర్‌ జిల్లాలోని పినరయిలో ముండయిల్‌ కోరన్, కళ్యాణి దంపతులకు జన్మించారు. థలస్సేరిలోని బ్రెన్నెన్‌ కాలేజీలో బీఏ (ఎకనామిక్స్‌) చదువుతున్న సమయంలో కేరళ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌కు కన్నూర్‌ జిల్లా కార్యదర్శిగా చేశారు. పాఠశాల విద్య పూర్తయ్యాక ఉన్నత విద్యకు వెళ్లేముందు ఏడాది పాటు చేనేత కార్మికుడిగా పనిచేశారు. తర్వాత కేరళ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. 1968వ సంవత్సరంలో 24 ఏళ్ల వయసులో విజయన్‌ సీపీఎం కన్నూర్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా చేరారు. రెండేళ్ల తర్వాత కూత్తుపరంబ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి 26 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

1996 నుండి 1998 వరకు కేరళ విద్యుత్‌ శాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. అయితే, జల విద్యుత్‌ ప్రాజెక్టుల ఆధునీకరణ కోసం ఒక కెనడా కంపెనీకి కాంట్రాక్టులు అప్పగించడానికి సంబంధించిన ఎస్‌ఎన్‌సీ–లావలిన్‌ కేసు ఆరోపణలు చాలా సంవత్సరాలు ఆయనను వెంటాడాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సమయంలో విజయన్‌కు, ఆయన ప్రత్యర్థి వీఎస్‌ అచ్యుతానందన్‌ మధ్య అంతర్గత వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో 2007లో పార్టీ పొలిటికల్‌ బ్యూరో నుంచి సైతం కొంతకాలం ఇద్దరినీ సస్పెండ్‌ చేశారు. బంగారం స్మగ్లింగ్‌ కేసు, డాలర్‌ స్మగ్లింగ్‌ కేసు, స్ప్రింక్లర్‌ ఒప్పందం, తన మాజీ ముఖ్య కార్యదర్శి ఎం.శివశంకర్‌పై వచి్చన ఆరోపణలతో సహా పలు వివాదాలు ఆయన చుట్టూ ముసురుకున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement