తృణమూల్ కాంగ్రెస్‌పై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత
దూరమైన హిందూ ఓటు బ్యాంకు
ఎస్‌ఐఆర్‌తో 90 లక్షల ఓట్లు తొలగింపు కూడా కారణమైంది
పశ్చిమ బెంగాల్ ప్రజలతో దీదీ(అక్క) అని ఆప్యాయంగా పిలిపించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ రాజకీయంగా సంచలనాలకు మారుపేరు. కరడుగట్టిన కమ్యూనిస్టులకే చుక్కలు చూపించిన నాయకురాలిగా 15 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలన సాగించారు. వరుసగా నాలుగోసారి విజయంపై కన్నేసినప్పటికీ ఆశలు నెరవేరలేదు. దీదీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. మరోసారి ఆమె పాలనను కోరుకోవడం లేదని తేల్చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టంగట్టారు. మమతా బెనర్జీ పార్టీ పరాజయానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకత.
అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం, కుంభకోణాలు, మహిళలపై అఘాయిత్యాలు, కట్ మనీ సంస్కృతి, అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రజలు సహించలేకపోయారు. మరోవైపు హిందూ ఓటు బ్యాంకు దూరం కావడం దీదీ కొంప ముంచింది. 71 ఏళ్ల మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాటం సాగించారు. అన్ని స్థానాలకూ తానే అభ్యర్థినని చెప్పుకోగా ప్రజలు అంగీకరించలేదు. ప్రభుత్వంలో, పార్టీలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మితిమీరిన పెత్తనం మేనత్త ఓటమికి మరో ముఖ్య కారణమైందని సొంత పార్టీ నేతలే ఆక్షేపిస్తున్నారు. భవానీపూర్‌లో సోమవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన అభిషేక్ బెనర్జీని చూసిన బీజేపీ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు. చోర్, చోర్(దొంగ, దొంగ) అంటూ నిందించారు.
ప్రజల్లో ప్రబలిన అసంతృప్తి
బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) పేరిట మమతా బెనర్జీకి అతిపెద్దసవాలు ఎదురైంది. ఎస్‌ఐఆర్ కింద రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఎస్‌ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందని, తమ మద్దతుదార్ల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మమతా బెనర్జీ గగ్గోలు పెట్టినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు.
తొలగింపునకు గురైన ఓటర్లలో చాలామంది తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదార్లేనని తెలుస్తోంది. 2011 నుంచి నిరాటంకంగా అధికారంలో కొనసాగుతున్న దీదీపై సహజంగానే ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఒకప్పుడు పారిశ్రామిక రాజధానిగా వెలుగొందిన బెంగాల్‌లో పరిశ్రమలు మూతపడడం, నిరుద్యోగం పెరిగిపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయి. ప్రధానంగా యువత విరక్తి చెందింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి రావడం వారిని కుంగదీసింది. దాంతో ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు.
దెబ్బతీసిన మైనార్టీ సంతుష్టీకరణ
2011లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొద్దికాలానికే కాంగ్రెస్‌ను అణచివేసేందుకు ప్రయతి్నంచారు. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి దూరమై, కమ్యూనిస్టులకు దగ్గరయ్యింది. దీదీ పతనానికి అడుగులు అప్పుడే పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. మైనార్టీల సంతుష్టీకరణ రాజకీయాలను దీదీ నమ్ముకున్నారు.
ఈ అంశాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంది. దీదీ హిందువుల వ్యతిరేకి అంటూ ఉధృతంగా ప్రచారం చేసింది. చొరబాటుదార్లను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు చేస్తోందని ఆరోపించింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇవన్నీ ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్రవేశాయి. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


