పినరయి కారుపై మోజు.. కుంజుమోన్ సీటుకు ‘క్లోజు’! | 25 Year Reign Ends, Kovoor Kunjumon Breaks Down After Massive Defeat | Sakshi
Sakshi News home page

పినరయి కారుపై మోజు.. కుంజుమోన్ సీటుకు ‘క్లోజు’!

May 9 2026 9:08 AM | Updated on May 9 2026 9:19 AM

25 Year Reign Ends, Kovoor Kunjumon Breaks Down After Massive Defeat

కన్నత్తూర్‌: పాతికేళ్ల పాటు ఒకే నియోజకవర్గానికి రారాజుగా వెలుగొందిన ఓ సీనియర్ రాజకీయ నేత తన తొలి ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. కన్నత్తూర్ నియోజకవర్గంపై తన ముద్ర తొలిసారి చెరిగిపోవడంతో ఆర్‌ఎస్‌పీ(ఎల్‌) నేత కోవూరు కుంజుమోన్  మీడియా సమక్షంలో కన్నీరుమున్నీరయ్యారు. 2001 నుంచి వరుస విజయాలు సాధించిన ఆయన, తాజా ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి ఉల్లాస్ కోవూరు చేతిలో ఏకంగా 25 వేల భారీ ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలవ్వడం కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

రాజకీయ ప్రస్థానం.. ఊహించని షాక్ 
కుంజుమోన్ రాజకీయ ప్రస్థానంలో 2016లో కీలక మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు ఉన్న మాతృసంస్థ (ఆర్‌ఎస్‌పీ) యూడీఎఫ్‌లో చేరడంతో, ఆయన విడిపోయి లెనినిస్ట్-మార్క్సిస్ట్ వర్గాన్ని స్థాపించి ఎల్‌డీఎఫ్‌తో జతకట్టారు. అప్పటినుంచి కన్నత్తూర్‌ను తన కంచుకోటగా నిలుపుకున్నారు. అయితే తాజా అనూహ్య ఓటమిపై ఆయన స్పందిస్తూ.. ‘నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులన్నీ తీసుకొచ్చాను, ప్రజల మధ్యే ఉన్నాను, ఓటమిని అంగీకరిస్తున్నాను’ అని అన్నారు.

ప్రచార లోపమే కొంపముంచిందా?
తన ఓటమికి ప్రజల్లో వ్యతిరేకత కంటే, తాను చేసిన పనులను ప్రచారం చేసుకోకపోవడమే ప్రధాన కారణమని కుంజుమోన్ విశ్లేషించారు. ‘కిఫ్బీ’ తదితర నిధులతో ఏకంగా రూ. 1,010 కోట్ల అభివృద్ధి పనులు చేశానని ఆయన గుర్తుచేశారు. ‘నేను ప్రచార ఆర్భాటాలకు పోయే వ్యక్తిని కాను. కానీ రోడ్లు, పాఠశాలల నిర్మాణం వంటి పనులను ప్లెక్సీలు, ప్రకటనల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సింది’ అని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధిని చాటుకోవడంలో విఫలమవ్వడమే ఈ పరాజయానికి దారితీసిందని కుంజుమోన్ అభిప్రాయపడ్డారు.

కారు కొంటే తప్పా..? కన్నీటి పర్యంతం 
మీడియా సమావేశంలో ఆయన వ్యక్తిగత జీవితం, ఇటీవల కొన్న కొత్త కారు గురించి ప్రస్తావన రాగానే కుంజుమోన్ తీవ్ర భావోద్వేగానికి గురై, వెక్కి వెక్కి ఏడ్చారు. ‘కామ్రేడ్ పినరయి విజయన్ నల్ల కారులో ప్రయాణిస్తుంటే చూసి, నాకూ అలాంటి కారు కొనుక్కోవాలనిపించింది. నా పొదుపు మొత్తాన్ని చిట్ ఫండ్స్ లో దాచుకుని, ఆ 27 లక్షలతో కారు కొన్నాను. అందులో తప్పేముంది?’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓటమి బాధ ఉన్నప్పటికీ, ప్రజాసేవలో కొనసాగుతానని, నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రాజెక్టుల కోసం పోరాడతానని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: ఓటింగ్‌లో సునామీ.. థర్డ్ జెండర్లకు ఒరిగిందేమీ..

Advertisement
 
Advertisement
Advertisement