ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో థర్డ్ జెండర్లకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. మరోవైపు అది దేశంలో ఆందోళన కలిగించే అంశంగానూ కనిపిస్తోంది. థర్డ్ జెండర్ వర్గం నుంచి ఎన్నికల బరిలో కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నిలుచున్నారు. అయితే ఆ ఇద్దరూ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్య వేదికపై వారి రాజకీయ ప్రాతినిధ్యం ఇంకా ఎంత వెనుకబడి ఉందనేది తెలియజేస్తోంది. ఓటింగ్ శాతంలో ఉత్సాహం చూపించిన ఈ వర్గం చట్టసభల మెట్లు ఎక్కడంలో తీవ్ర నిరాశనే ఎదుర్కొంటోంది.
బరిలో నిలిచింది ఇద్దరే
ఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇద్దరు థర్డ్ జెండర్ అభ్యర్థులు మాత్రమే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కేరళ నుంచి ఒకరు, తమిళనాడు నుంచి మరొకరు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచేందుకు ధైర్యం చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఎన్నికల్లో మిగిలిన ఏ రాష్ట్రం నుంచి కూడా ఈ వర్గానికి కనీస ప్రాతినిధ్యం దక్కలేదు.
డిపాజిట్లు కూడా దక్కలేదు
పోటీ చేసిన ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ఓటర్ల నుంచి కనీస మద్దతును సాధించలేకపోయారు. ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఇద్దరు అభ్యర్థులు ఓటర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేక, తమ డిపాజిట్లను సైతం కోల్పోయారు. ఎన్నికల బరిలో నిలబడటమే ఒక పెద్ద సవాలుగా మారిన ప్రస్తుత తరుణంలో, వారికి ప్రజల ఆదరణ కూడా ఆశించిన స్థాయిలో లభించకపోవడం గమనార్హం.
గత ఎన్నికల్లోనూ ఇదే తీరు
థర్డ్ జెండర్ అభ్యర్థులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సరిగ్గా ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. అప్పట్లో కేరళలో ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి పోటీ చేయగా, తమిళనాడులో ఇద్దరు బరిలో నిలిచారు. అయితే, ఆ ఎన్నికల్లోనూ వీరెవరూ విజయం సాధించలేకపోయారు, పైగా వీరు తమ డిపాజిట్లను సైతం కోల్పోయారు.
ఓటింగ్ కు క్యూ కట్టిన బెంగాల్
గత నెలలో అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మే 4న ఫలితాలు వెలువడ్డాయి. పోటీలో వెనుకబడినప్పటికీ, ఓట్లు వేయడంలో మాత్రం థర్డ్ జెండర్ ఓటర్లు విశేషంగా స్పందించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని రెండో విడత పోలింగ్‌లో ఏకంగా 91.28 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,257 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉండగా, తొలి దశలో 465 మంది (56.79 శాతం), రెండో దశలో 792 మంది (91.28 శాతం) ఓటేశారు.
పుదుచ్చేరి రికార్డ్.. ఇతర రాష్ట్రాల పరిస్థితి?
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 139 మాత్రమే అయినప్పటికీ, ఏకంగా 91.81 శాతం మంది పోలింగ్ బూత్‌లకు వెళ్లి అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఇక 7,728 మంది థర్డ్ జెండర్ ఓటర్లతో అత్యధిక సంఖ్య కలిగిన తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్ లో కేవలం 60.49 శాతం ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 343 మంది ఓటర్లకు గాను 36.84 శాతం పోలింగ్ జరగ్గా, కేరళలో 277 మంది ఓటర్లలో 57.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఈసీ వెల్లడించింది.
నవీన్ చావ్లా చొరవతోనే గుర్తింపు
ఒకప్పుడు ఓటరు జాబితాలో తమ ఉనికిని చాటుకోవడానికి కూడా ఇబ్బంది పడిన థర్డ్ జెండర్ వర్గానికి.. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకంగా నిలిచింది. ఆయన చొరవతోనే ఓటర్ల నమోదు ప్రక్రియలో ‘ఇతరులు’ (Others) లేదా ‘ఓ’ (O) కేటగిరీ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగానే ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్లను ‘పురుషులు’, ‘మహిళలు’, ‘ఇతరులు’ లేదా ‘థర్డ్ జెండర్’గా అధికారికంగా గుర్తిస్తూ, వారికి ఓటు హక్కును కల్పిస్తోంది.
ఇది కూడా చదవండి: కాషాయ భారతం: 21 రాష్ట్రాలు.. రాజ్యసభలో 113 సీట్లు


