దాదా నువ్వు కూడా అంతే; సచిన్‌ కౌంటర్‌!!

Sachin Tendulkar Fun With Ganguly And Sehwag In Commentary Box - Sakshi

క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ మెగాటోర్నీ వరల్డ్‌ కప్‌-2019 కోసం కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌-సౌతాఫ్రికాల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి కామెంటరీ బాక్స్‌లో సందడి చేశాడు. ఇక బుధవారం సఫారీలతో టీమిండియా తలపడిన నేపథ్యంలో లిటిల్‌ మాస్టర్‌ సరికొత్త ఉత్సాహంతో తనదైన శైలిలో మాటల బాణాలు వదిలాడు. సెహ్వాగ్‌తో కలిసి దాదాపై పంచుల మీద పంచులు వేస్తూ అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

నువ్వు కూడా అంతే కదా దాదా...!!
వరల్డ్‌ కప్‌-2019లో భాగంగా తమ మొదటి మ్యాచ్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన సఫారీల కెప్టెన్‌ డు ప్లెసిస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని.. భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. అయితే భారత బౌలర్ల పదునైన బౌలింగ్‌తో సౌతాఫ్రికా 9వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేయగలింది. కాగా పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న ప్రత్యర్థి పేసర్లు రబడ (2/39), మోరిస్‌ (1/36) చుక్కలు చూపారు. ఇందులో భాగంగా క్రిస్‌ మోరిస్‌ తన మొదటి ఓవర్లోనే విజృంభించాడు. అతడి బౌలింగ్‌లో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాట్‌ విరిగిపోయింది.

ఈ విషయం గురించి కామెంటరీ బాక్స్‌లో ఉన్న గంగూలీ మాట్లాడుతూ... ‘బ్యాట్‌ కొసభాగం పలుచగా ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఇలా జరుగుతుంది. కానీ సచిన్‌ బ్యాట్‌ మాత్రం విరిగిపోదు’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా..అవును నిజమే ఆయన బ్యాట్‌ ఎలా విరిగిపోతుందిలే దాదా అంటూ సెహ్వాగ్‌ బదులిచ్చాడు. వెంటనే మళ్లీ అందుకున్న గంగూలీ..‘ ఆయన బ్యాట్‌ కింద కొన్ని బంతులే పడతాయి. బ్యాట్‌ మధ్య భాగంలో పడే బంతులే ఎక్కువగా ఉంటాయి. అయినా సచిన్‌ బ్యాట్‌తో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాడు. ఒక్కోసారి బ్యాట్‌కు ఫెవిక్విక్‌ పెడతాడు. గ్లూ వాడతాడు. ఇలా ఏది వాడినా బ్యాట్‌ను సంభాలించుకోగలుగుతాడు’ అంటూ సచిన్‌ను టీజ్‌ చేశాడు. వీరిద్దరి సరదా సంభాషణలో ఎంట్రీ ఇచ్చిన సచిన్‌..కేవలం తనే కాదు దాదా కూడా బ్యాట్‌తో ఇలాంటి ఆటలే ఆడతాడు అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. అంతేకాకుండా లార్డ్స్‌లో తామిద్దరం కలిసి ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌ తాలూకు ఙ్ఞాపకాలు గుర్తు చేస్తూ... నవ్వులు పుయించాడు. కాగా ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్లతో విజయం సాధించిన మెగాటోర్నీని ఘనంగా ఆరంభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top