అష్ట దిగ్గజాల ఆట...

Quarter finals from football to the World Cup today - Sakshi

నేటి నుంచి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌

విశ్వ సమరంలో వీర రస ప్రదర్శనకు మళ్లీ రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు నుంచి మొదలు పెట్టి అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు తమ సత్తా చాటేందుకు సై అంటున్నాయి. తొలి రోజు ఖండాంతర పోరులో శుక్రవారం ఉరుగ్వే–ఫ్రాన్స్, బ్రెజిల్‌–బెల్జియం క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. వీటిలో సెమీస్‌ మెట్టును రెండు దక్షిణ అమెరికా (ఉరుగ్వే, బ్రెజిల్‌) జట్లే ఎక్కుతాయో... లేదా రెండు యూరప్‌ దేశాలు (ఫ్రాన్స్, బెల్జియం) ముందంజ వేస్తాయో చూడాలి...!

నిజ్ని నవ్‌గొరొడ్‌: ప్రత్యర్థులకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వకుండా... అయిదు గోల్స్‌ చేసి లీగ్‌ దశను అజేయంగా ముగించింది ఉరుగ్వే. ప్రి క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు గోల్‌ ఇచ్చినా ప్రతిగా రెండు కొట్టి గెలుపొందింది. మరోవైపు ఫ్రాన్స్‌ ప్రయాణం నిదానంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా, పెరూపై గెలిచి, డెన్మార్క్‌తో డ్రా చేసుకుంది. ప్రి క్వార్టర్స్‌లో మాత్రం అర్జెంటీనాపై జూలు విదిల్చింది. మొత్తమ్మీద రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్‌ చేశాయి. ఇక శుక్రవారం క్వార్టర్‌ ఫైనల్‌ను 350 మ్యాచ్‌ల విశేష అనుభవం ఉన్న డిగో గోడిన్, జిమెనెజ్, క్యాసెరెస్, లక్జాల్ట్‌ల ఆధ్వర్యంలోని ఉరుగ్వే రక్షణ శ్రేణికి... గ్రీజ్‌మన్, ఎంబాపెల ఫ్రాన్స్‌ ఫార్వర్డ్‌ దళానికి మధ్య పోరాటంగా పేర్కొనవచ్చు.

స్టార్‌ స్ట్రయికర్‌ సురెజ్‌ ఫామ్‌ భరోసానిస్తున్నా, ప్రి క్వార్టర్స్‌లో రెండు గోల్స్‌తో గెలిపించిన మరో స్టార్‌ ఎడిన్సన్‌ కవాని గాయం ఉరుగ్వేను కలవరపరుస్తోంది. అతడు బరిలో దిగేది అనుమానంగానే ఉంది. గత మ్యాచ్‌లో అర్జెంటీనాపై విజయం ఫ్రాన్స్‌లో ఆత్మవిశ్వాసం పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. టీనేజ్‌ సంచలనం ఎంబాపె తన వేగంతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. అతడికి గ్రీజ్‌మన్, గిరౌడ్, ఉస్మాన్‌ డంబెల్‌ తోడైతే తిరుగుండదు. వీరి ఆధ్వర్యంలోని ఫార్వర్డ్‌ బృందం ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించే ప్రయత్నాలు మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చడం ఖాయం. దీనిని దృష్టిలో పెట్టుకునే ‘ఫ్రాన్స్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చామో వారిని అందుకోవడం చాలా కష్టం’ అని ఇప్పటికే ఉరుగ్వే కోచ్‌ ఆస్కార్‌ తబ్రెజ్‌ వ్యాఖ్యానించాడు. ‘బలమైన ఉరుగ్వే నుంచి భిన్న ఆట ఎదురుకావొచ్చు’ అనేది ఫ్రాన్స్‌ కోచ్‌ డెచాంప్స్‌ అంచనా. 
ఉరుగ్వే (vs) ఫ్రాన్స్‌  రాత్రి గం. 7.30 నుంచి 

కజన్‌: వరల్డ్‌ కప్‌లో బ్రెజిల్‌ ప్రయాణం సాఫీగా సాగుతోంది. మాజీ చాంపియన్లు ఒక్కొక్కటే వెనుదిరుగుతున్నా, సాంబా జట్టు మాత్రం ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. లీగ్‌ దశలో డ్రాతో స్విట్జర్లాండ్‌ విస్మయపర్చినా... కోస్టారికా, సెర్బియాలపై సాధికార విజయాలు సాధించింది. ప్రి క్వార్టర్స్‌లో మెక్సికోకు చిక్కకుండా తప్పించుకుంది. అటువైపు బెల్జియం మాత్రం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ లీగ్‌లో అజేయంగా నిలిచింది. ప్రి క్వార్టర్స్‌లో జపాన్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న తీరు అదెంత ప్రమాదకర జట్టో చాటింది. ప్రపంచ ర్యాంకుల్లో 2, 3 స్థానాల్లో ఉన్న వీటి మధ్య క్వార్టర్స్‌లో భీకర పోరాటం ఖాయం. టోర్నీలో ఇప్పటివరకు ఏడు గోల్స్‌ చేసిన బ్రెజిల్‌... ప్రత్యర్థులకు ఒక్కటే ఇచ్చింది. బెల్జియం ఏకంగా 12 గోల్స్‌ కొట్టి... నాలుగు ఇచ్చింది.

కీలక సమయంలో స్టార్‌ ఆటగాడు నెమార్‌ ఫామ్‌లోకి రావడంతో పాటు సాంబా జట్టు ఆట క్రమంగా పదునెక్కుతోంది. యువ గాబ్రియెల్‌ జీసస్‌ కూడా మెరిస్తే తిరుగుండదు. థియాగో సిల్వా, మిరండా వంటి సీనియర్లతో పటిష్ఠంగా కనిపిస్తున్న వీరి రక్షణ శ్రేణిని బెల్జియం స్టార్లు హజార్డ్, లుకాకు, మెర్టెన్స్‌లు ఏమేరకు ఛేదిస్తారో చూడాలి. గత మ్యాచ్‌లోలా ఆధిక్యం కోల్పోతే కోలుకోవడానికి వీలుండదు. ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండటంతో బెల్జియంను ‘గోల్డెన్‌ జనరేషన్‌’ జట్టుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు కాకుంటే మరె ప్పుడూ కప్పు గెలిచే అవకాశం రాదంటున్నారు. ఈ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ను ఓడిస్తే 1986 తర్వాత బెల్జియం సెమీస్‌కు చేరినట్లవుతుంది.   

బ్రెజిల్‌ (vs) బెల్జియం  రాత్రి గం.11.30 నుంచి
సోనీ ఈఎస్‌పీఎన్,  సోనీ టెన్‌–2, 3లలో ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top