
ఇన్‌సెట్‌లో భారత జాతీయ పతాకం, పక్కన కెప్టెన్ రాణి రాంపాల్
జాతీయ పతాకంలో అశోక చక్రాన్ని మరిచిన నిర్వాహకులు..
లండన్ : మహిళల హాకీ ప్రపంచకప్ టోర్నీ నిర్వాహకులపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్ వేదికగా శనివారం నుంచి ఆగస్టు 5 వరకు కొనసాగే ఈ టోర్నీలో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత్ జట్టు పాల్గొంటుంది. అయితే ఈ టోర్నీకి ముందు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నిర్వాహకులు ఘోర తప్పిదం చేశారు. భారత జాతీయ పతాకంలో అశోక చక్రాన్ని మరిచారు. దీంతో అభిమానులు టోర్నీ నిర్వహకులపై మండిపడుతున్నారు.
టోర్నీ ప్రచారంలో భాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఫొటోషూట్‌లో 16 దేశాలకు చెందిన కెప్టెన్లు పాల్గొన్నారు. మిగతా సారథులతో కలిసి భారత కెప్టెన్ రాణి సైతం ఫొటోషూట్‌కు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయా కెప్టెన్లు తమ దేశానికి సంబంధించిన జాతీయ పతాకాల పక్కన నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే, నిర్వాహకులు భారత జాతీయ పతాకంలో అశోకచక్రాన్ని ఉంచడం మరిచారు. మన జాతీయ పతాకం పక్కన రాణి రాంపాల్ నిల్చున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
దీంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి తప్పులు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఇక పూల్-బిలో చోటు దక్కించుకున్న భారత్ శనివారం తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో తలపడనుంది.
Ashok Chakra missing from the Indian flag. Is it a mistake or done intentionally?
— Nilesh Tandon (@nileshtandon) July 19, 2018