జపాన్‌ విలాపం... | Sakshi
Sakshi News home page

జపాన్‌ విలాపం...

Published Wed, Jul 4 2018 1:17 AM

One gamble too far for heartbroken Japan - Sakshi

90+4 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 47 నిమిషాలు స్కోరే లేదు! తుది ఫలితం మాత్రం 3–2. అంటే మిగతా 47 నిమిషాల్లో ఐదు గోల్స్‌! బెల్జియం, జపాన్‌ మధ్య జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నాకౌట్‌ పోరు తీవ్రతకు నిదర్శనమిది! ఓ వైపు రెండు జట్ల దూకుడైన ఆట... మరోవైపు గోల్‌పోస్ట్‌ వద్ద కీపర్ల అసమాన ప్రతిఘటన...! నిర్ణీత సమయంలో 2–2తో స్కోరు సమం. ఇంజ్యూరీలో పుంజుకున్న బెల్జియం  ఔరా అనిపించేలా గెలవగా... ఆఖరి క్షణంలో గోల్‌ సమర్పించుకున్న జపాన్‌ కుదేలైంది! ఓ దశలో 2–0తో ఆధిక్యంలో నిలిచి విజయం దిశగా  సాగుతున్న ‘బ్లూ సమురాయ్‌’ బృందం ఆ తర్వాత ఏకంగా మూడు గోల్స్‌ ఇచ్చుకొని ఓటమిని మూటగట్టుకుంది.

రొస్తావ్‌ ఆన్‌ డాన్‌: ఈ ప్రపంచ కప్‌లో అందరూ తమ జట్టును ప్రమాదకరమైనదిగా ఎందుకు పేర్కొంటున్నారో చాటుతూ బెల్జియం అద్భుతం చేసింది. నాలుగు నిమిషాల వ్యవధిలో జపాన్‌కు రెండు గోల్స్‌ ఇచ్చి చేజారిందనుకున్న మ్యాచ్‌ను... ఐదు నిమిషాల తేడాలో రెండు గోల్స్‌ చేసి నిలబెట్టుకుంది. స్కోరు సమమైన వేళ, ఇంజ్యూరీ సమయంలో మెరుపు ఆటతో ఫలితాన్ని తమవైపు తిప్పుకొంది. ఓడినా జపాన్‌ చక్కటి పోరాటంతో ఆకట్టుకుంది. సంచలనం సృష్టించేలా కనిపించిన ఆసియా జట్టు... ఆధిక్యం కోల్పోయి, ఆఖర్లో అనూహ్యంగా పరాజయం పాలైంది. రెండు జట్ల మధ్య సోమవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 3–2తో గెలుపొందింది. జెన్కి హరగూచి (48వ నిమిషం), తకాషి ఇనుయ్‌ (52వ ని.)లు జపాన్‌ తరఫున గోల్స్‌ చేశారు. జాన్‌ వెర్టన్‌గెన్‌ (69వ ని.), మరౌనె ఫెల్లాయిని (74వ ని.), నేసర్‌ చాడ్లీ (90+4వ ని.)లు బెల్జియంకు స్కోరు అందించారు. 

ఆధిపత్యం అటు... ఇటు 
పోటాపోటీ ఆటతో మ్యాచ్‌ రసవత్తరంగా ప్రారంభమైంది. బెల్జియం మిడ్‌ ఫీల్డర్లు ఈడెన్‌ హజార్డ్, డ్రీస్‌ మెర్టెన్స్‌లు వీలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ప్రత్యర్థి లొంగలేదు. మొదటి నిమి షంలోనే జపాన్‌ ఆటగాడు కొట్టిన షాట్‌ గోల్‌పోస్ట్‌ పక్కనుంచి వెళ్లింది. కొద్దిసేపటికే మెర్టెన్స్‌ అందించిన క్రాస్‌ను రొమేలు లుకాకు వృథా చేశాడు. హజార్డ్, లుకాకులకు సహచరుల నుంచిఅండ కరవై బెల్జియం ప్రభావవంతంగా కనిపించలేదు. జపాన్‌ సైతం ఓ గోల్‌ చాన్స్‌ చేజార్చుకుంది. మొదటి భాగంలో 55 శాతం బంతి బెల్జియం ఆధీనంలోనే ఉంది. 

ధనాధన్‌... 
రెండోభాగం మొదలవుతూనే జపాన్‌ దడదడలాడించింది. ఆటగాళ్ల మధ్య నుంచి వచ్చిన బంతిని వెంటాడిన హరగూచి... డి బాక్స్‌ లోపల ప్రత్యర్థిని ఏమారుస్తూ గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. మరుసటి నిమిషంలో బెల్జియం దాడికి దిగినా బంతి గోల్‌బార్‌ను తాకి వెనక్కు వచ్చింది. ఇక 52 వ నిమిషంలో ఇనుయ్‌ డి బాక్స్‌ ముందు నుంచి కొట్టిన షాట్‌ నెట్‌లోకి  చేరింది. జపాన్‌ ఒక్కసారిగా 2–0 ఆధిక్యంలోకి వెళ్లడంతో బెల్జియం దాడులు పెంచింది. ఫెల్లాయిని, చాడ్లీలను సబ్‌స్టిట్యూట్‌లుగా దింపింది. దీనికి ప్రతిఫలమే 69వ నిమిషంలో వెర్టన్‌గెన్‌ గోల్‌. కార్నర్‌లో ఉన్న అతడు హెడర్‌ ద్వారా కొట్టిన షాట్‌ ఎత్తులో వెళ్లి గోల్‌పోస్ట్‌లో పండింది. కొద్దిసేపటికే క్రాస్‌ షాట్‌ను ఫెల్లాయిని... తలతో గోల్‌గా మలిచాడు. సమయం దగ్గరపడటంతో బెల్జియం దూకుడు చూపినా కీపర్‌ కవాషియా రెండుసార్లు అద్భుతంగా అడ్డుకున్నాడు. స్కోర్లు సమమై... ఇంజ్యూరీ సమయం కూడా ముగుస్తుండటంతో మరో షూటౌట్‌ తప్పదని అనిపించింది. అయితే... ఆఖరి నిమిషంలో కుడివైపు నుంచి అందిన బంతిని చాడ్లీ నేర్పుగా గోల్‌ కొట్టి బెల్జియంకు విజయం కట్టబెట్టాడు. 

‘థ్యాంక్యూ రష్యా’ 
మ్యాచ్‌లో ఓడిపోయిన జట్లు అసహనంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో అద్దాలు పగలగొట్టడం, వస్తువులను చిందరవందర చేయడం ఎన్నో సార్లు చూశాం. కానీ ఈ తరహాలో అతి శుభ్రంగా, అసలు అక్కడ అప్పటి వరకు ఎవరూ లేనట్లుగా ఉంచడం ఎప్పుడైనా చూశామా? కానీ జపాన్‌ మాత్రం అలాగే చేసింది. బెల్జియం చేతిలో పరాజయం బాధిస్తున్నా...తమ క్రమశిక్షణలో మాత్రం కట్టుతప్పలేదు. అక్కడినుంచి వెళ్లిపోయే ముందు అన్నీ క్రమపద్ధతిలో, కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించకుండా సర్దిపెట్టింది. పైగా వెళుతూ వెళుతూ రష్యన్‌ భాషలో కృతజ్ఞతలు చెబుతూ ఒక కార్డును అక్కడ ఉంచింది. హ్యాట్సాఫ్‌ టు జపాన్‌!  

Advertisement
Advertisement