స్వర్ణ యోగం కాదు..! | Sakshi
Sakshi News home page

స్వర్ణ యోగం కాదు..!

Published Sat, Sep 3 2016 1:24 AM

స్వర్ణ యోగం కాదు..!

‘లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్యం రజతంగా మారి మూడు రోజులు కూడా కాలేదు... అప్పుడే ఆ రజతం స్వర్ణంగా మారిపోతోంది... పసిడి సాధించిన రెజ్లర్ కూడా డోపింగ్‌లో పట్టుబడటంతో మన యోగేశ్వర్ దత్ బంగారు పతకాన్ని అందుకోబోతున్నాడు...’  శుక్రవారం భారత క్రీడాభిమానులను ఆనందంలో ముంచెత్తిన వార్త ఇది. అరుుతే వాస్తవం వేరుగా ఉంది. మరో ఆటలో అయితే స్వర్ణ విజేత పట్టుబడితే రజతం ఆటోమెటిక్‌గా స్వర్ణంగా మారిపోయేదేమో కానీ... ఇక్కడ అది సాధ్యం కాదు. యోగేశ్వర్‌తో పాటు మరో పార్శ్వంనుంచి కాంస్యం సాధించిన అమెరికా రెజ్లర్ కొలెమాన్ స్కాట్‌ను ఆ అదృష్టం వరించనుంది. 2012లో స్వర్ణం గెలిచిన అస్గరోవ్ డోపీగా తేలడంతో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది.  
 
* యోగేశ్వర్‌కు రజత పతకమే
* కొలెమాన్ స్కాట్‌కు పసిడి!
* ఒలింపిక్స్ పతకంలో మరో మార్పు
* డోపింగ్‌లో పట్టుబడ్డ అస్గరోవ్  

న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్ 60 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత ఆటగాడు యోగేశ్వర్‌దత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. అయితే ఈ పోటీల్లో రజతం సాధించిన కుదుఖోవ్ (రష్యా) డోపింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతని పతకాలు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రద్దు చేసింది.

దాంతో యోగేశ్వర్ పతకం కంచునుంచి వెండిగా మారింది. అయితే తాజా డోపింగ్ పరీక్షల్లో నాడు స్వర్ణం సాధించిన ఆటగాడు కూడా పట్టుబడ్డాడు. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) నిర్వహించిన పరీక్షల్లో అజర్‌బైజాన్‌కు చెందిన తోగ్రుల్ అస్గరోవ్ పాజిటివ్‌గా తేలాడు. ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) ఇంకా దీనిని అధికారికంగా ఖరారు చేయలేదు. అస్గరోవ్ పతకాన్ని వెనక్కి తీసుకుంటే యోగేశ్వర్‌కు స్వర్ణ యోగం పట్టవచ్చని వినిపించింది.
 
ఎందుకు కాదు?
కాంస్యాలు సాధించిన యోగేశ్వర్, కొలెమాన్ స్కాట్ రెండు వేర్వేరు పార్శ్వాలలో ఆడారు. పై పార్శ్వంనుంచి సెమీస్‌కు చేరిన స్కాట్... అక్కడ అస్గరోవ్ (స్వర్ణవిజేత) చేతిలో ఓడాడు. అనంతరం కాంస్య పతక పోరులో యుమొటో (జపాన్)ను ఓడించి పతకం సాధించాడు. దిగువ భాగంలో ప్రిక్వార్టర్‌లో ఓడిన యోగి...ఆ తర్వాత రెండు రెపిచేజ్ మ్యాచ్‌లతో పాటు జాంగ్ మ్యోంగ్ (ఉత్తర కొరియా)పై గెలిచి కంచు పతకం అందుకున్నాడు. రజతం సాధించిన కుడుఖోవ్... యోగేశ్వర్ ఉన్న పార్శ్వంలోనే న్నాడు. అందుకే అతని పతకం రద్దు కాగానే అదే వైపునుంచి కాంస్యం సాధించిన యోగి పతకం అప్‌గ్రేడ్ అయింది.

ఇదే నిబంధనను వర్తింపజేస్తే అస్గరోవ్, స్కాట్ ఒకే పార్శ్వంలో ఉన్నారు. కాబట్టి అస్గరోవ్ స్వర్ణం స్కాట్‌కు అందేందుకే అవకాశం ఉంది. నేరుగా రజతంనుంచి స్వర్ణంగా మారేందుకు స్కాట్‌తో పోలిస్తే యోగేశ్వర్‌కు అదనపు అర్హత ఏమీ లేదు. ఇద్దరూ కాంస్య విజేతలుగా సమాన స్థాయిలోనే ఉన్నారు.
 
అవకాశాలు ఏమిటి?
ఈ అంశంపై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే నిబంధనల ప్రకారం ఎలా చూసినా యోగేశ్వర్‌కు స్వర్ణం లభించడం సాధ్యం కాకపోవచ్చు. వరుసగా రెండు బౌట్‌లు నెగ్గి నేరుగా సెమీ ఫైనల్‌కు చేరిన స్కాట్ ప్రదర్శనే ఒలింపిక్స్‌లో యోగికంటే మెరుగ్గా ఉంది. ఈ విషయంలో భారత రెజ్లర్‌కంటే అతని వైపు మొగ్గు ఉంది. పతకం కోసం యోగేశ్వర్ రెండు రెపిచేజ్ రౌండ్లు కూడా ఆడగా... స్కాట్ వాటి అవసరం లేకుండా నేరుగా కాంస్య పోరులో తలపడ్డాడు. ఇప్పటికే యోగేశ్వర్ పతకం అప్‌గ్రేడ్ అయింది కాబట్టి మరో కాంస్య విజేతగా కొలెమాన్‌కు కూడా ఇదే అవకాశం ఉంది.

పూర్తిగా అతడిని పక్కన పెట్టేసి యోగేశ్వర్‌నే మరో మెట్టు ఎక్కించేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే... అస్గరోవ్ చేతిలో ఓడిన కొలెమాన్‌కే స్వర్ణం దక్కవచ్చు. లేదంటే అతడికి కూడా రజతం ఇవ్వవచ్చు. ఇద్దరు రెజ్లర్లకు రజతాలు ఇచ్చి ఈ ఈవెంట్‌కు సంబంధించి స్వర్ణాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. భారతీయుడిగా స్వర్ణం కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ అది అంత ఏకపక్షంగా మాత్రం సాధ్యం కాదు!  
 
నాకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే నాకున్న అవగాహన ప్రకారం నాకు రజతం మాత్రమే లభిస్తుంది. మేమిద్దరం కాంస్యాలు గెలుచుకున్నాం. నేను రెపిచేజ్ ద్వారా అర్హత పొంది సిల్వర్ మెడలిస్ట్ చేతిలో ఓడాను. అయితే స్కాట్ మాత్రం చాంపియన్ చేతిలో ఓడాడు. కాబట్టి స్వర్ణం అతనికే దక్కాలి. నాకు తెలిసి నా పతకం స్వర్ణంగా మారదు.
- యోగేశ్వర్‌దత్

Advertisement

తప్పక చదవండి

Advertisement