ఆ సాహసం భారత్‌ చేస్తుందా?: గంగూలీ

No chance of bilateral cricket with Pakistan, Ganguly - Sakshi

కోల్‌కతా: ఇక పాకిస్తాన్‌తో భారత్‌ ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు ఆడే అవకాశం దాదాపు మూసుకుపోయినట్లేనని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవచ్చనే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. ‘ పుల్వామా ఉగ్రదాడిలో సుమారు 40 మంది భారత జవాన్లు అమర వీరులు కావడం నిజంగా చాలా బాధాకరం. ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదు. దీనిపై భారత ప్రజల నుంచి వచ్చే స్పందన ఏదైతే ఉందో అది సరైనదే. ప్రధానంగా పాకిస్తాన్‌తో క్రికెట్‌కు దూరంగా ఉండాలంటూ భారత ప్రజల విజ్ఞప్తి ఆమోదయోగ్యమైనదే.  పాక్‌ దుశ్చర్యకు దీటైన జవాబు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ భారత ప్రజల మనోభావాలను నేను అర్ధం చేసుకోగలను. పాకిస్తాన్‌తో క్రికెట్‌ సిరీస్‌లతో పాటు అన్ని క్రీడా సంబంధాలు తెంచుకోవాలనేది  వారి విన్నపం. నేను అందుకు మద్దతు తెలుపుతున్నా.

దీనిపై భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. భారత్‌ నుంచి దీటైన సమాధానం వస్తుందనే ఆశిస్తున్నా. పాక్‌తో క్రికెట్‌ సిరీస్‌లు ఆడే విషయంలో బీసీసీఐ కూడా గట్టి నిర్ణయమే తీసుకోవాలి. అనవసరమైన విషయాల్ని పక్కను పెట్టి పాక్‌తో సిరీస్‌లను వదులుకునే విషయాన్ని తెగేసి చెప్పాలి. ప‍్రస్తుతం సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన పరిపాలన కమిటీతో బీసీసీఐ నడుస్తోంది. దాంతో కఠినమైన  నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐలో ఆఫీస్‌ బేరర్లు లేకుండా పోయారు. అయినప్పటికీ ఈ విషయంలో బీసీసీఐ పరిపాలక కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందనే అనుకుంటున్నా’ అని గంగూలీ అన్నాడు. వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ జరుగుతుందా.. లేదా అనేది ఐసీసీ నిర్ణయాన్ని బట్టే ఉంటుందని, దీనిపై మరికొంత కాలం వేచి చూడక తప్పదని గంగూలీ అన్నాడు. భారత్ లేకుండా ఐసీసీ వరల్డ్‌కప్‌ నిర్వహించడం కష్టమేనని, మరి పాక్‌తో మ్యాచ్‌ను ఆడకుండా ఉండేందుకు భారత్‌ సాహసం చేయగలదా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉందన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top