నోబాల్‌ అంపైర్‌...

No Ball Umpire For India Premier League - Sakshi

ఐపీఎల్‌లో అదనపు పర్యవేక్షణ

‘పవర్‌ ప్లేయర్‌’ ఆలోచనకు బ్రేక్‌

గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం

ముంబై: ఐపీఎల్‌–2019లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ గుర్తుందా! ముంబైతో మ్యాచ్‌లో చివరి బంతికి విజయం కోసం బెంగళూరు 7 పరుగులు చేయాల్సి ఉండగా, మలింగ వేసిన బంతికి పరుగు రాలేదు. అయితే టీవీ రీప్లేలో అది ‘నోబాల్‌’గా తేలింది. దానిని అంపైర్లు సరిగా గమనించి ఉంటే అదనపు పరుగు రావడంతో పాటు సిక్సర్‌తో తాము గెలిచే అవకాశం ఉండేదని భావించిన కోహ్లి ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. రాజస్తాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో అంపైర్లు ముందుగా ‘నోబాల్‌’ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో చెన్నై కెప్టెన్‌ ధోని ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చి వాదనకు దిగాడు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఐపీఎల్‌ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. 2020 ఐపీఎల్‌లో తొలిసారి ‘నోబాల్‌ అంపైర్‌’ అంటూ ప్రత్యేకంగా నియమించనున్నారు.

ఇద్దరు ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్, రిజర్వ్‌ అంపైర్‌లకు ఇది అదనం. కేవలం మ్యాచ్‌లో నోబాల్స్‌నే ప్రత్యేకంగా పరిశీలించడమే అంపైర్‌ పని. ‘ఈ అంపైరింగ్‌ గురించి చెబుతుంటే  కొంత వింత గా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. మేం టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం. కాబట్టి నోబాల్స్‌ పొరపాట్లనే ప్రత్యేకంగా గుర్తించేందుకు ఒక అంపైర్‌ ఉంటే మంచిదే. రాబోయే ముస్తాక్‌ అలీ దేశవాళీ టి20 టోర్నీలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించే అవకాశం ఉంది’ అని కౌన్సిల్‌ సభ్యుడొకరు వెల్లడించారు. మరోవైపు మ్యాచ్‌లో ‘పవర్‌ ప్లేయర్‌’ను తీసుకొచ్చే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని కూడా కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పటి వరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అనుమతి లభించలేదని తెలిసింది. ఎక్కువ మంది సీనియర్లు ఉన్న ఒక ఐపీఎల్‌ ఫ్రాంచైజీకి చెందిన వ్యక్తి తమ అనుకూలత కోసమే ఈ కొత్త తరహా ప్రతిపాదన చేశాడని సమాచారం.

డిసెంబర్‌ 19న వేలం... 
ఐపీఎల్‌–2020 కోసం జరిగే ఆటగాళ్ల వేలంను డిసెంబర్‌ 19న కోల్‌కతాలో నిర్వహించాలని గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతీ సారి వేలం బెంగళూరులోనే జరిగింది. 2019తో పోలిస్తే ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ మరో రూ. 3 కోట్లు అదనంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తూ గరిష్టంగా రూ. 85 కోట్లకు పెంచారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top