కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే 

Nine Points Difference Between Kohli And Smith - Sakshi

ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌   

దుబాయ్‌: సంవత్సరం పాటు ఆటకు దూరమైనా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్మిత్‌ రెండో స్థానానికి (913 రేటింగ్‌ పాయింట్లు) చేరుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 378 పరుగులు చేసిన స్మిత్‌... కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కి తోసి కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (922) ఈ జాబితాలో నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు. యాషెస్‌లో స్మిత్‌కు మరో మూడు టెస్టులు మిగిలి ఉండగా, కోహ్లి విండీస్‌తో రెండు టెస్టులు ఆడనున్నాడు. ఇద్దరి మధ్య పాయింట్ల తేడా 9 మాత్రమే కావడంతో అగ్రస్థానానికి ఇప్పుడు హోరాహోరీ పోటీ తప్పదు. కోహ్లితో పాటు టాప్‌–10లో భారత్‌ నుంచి పుజారా (4వ స్థానంలో) ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా (5వ ర్యాంక్‌), అశ్విన్‌ (10వ ర్యాంక్‌) టాప్‌–10లో ఉండగా... ప్యాట్‌ కమిన్స్‌ (914 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన కరుణరత్నే (8వ ర్యాంక్‌) నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్‌–10లోకి అడుగు పెట్టగా...వరుసగా విఫలమవుతున్న జో రూట్‌ 6 నుంచి 9వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జేసన్‌ హోల్డర్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు.  

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top