అలా చెప్పడం చాలా కష్టంగా ఉంది: కుంబ్లే | Sakshi
Sakshi News home page

అలా చెప్పడం చాలా కష్టంగా ఉంది: కుంబ్లే

Published Fri, Feb 17 2017 12:55 PM

అలా చెప్పడం చాలా కష్టంగా ఉంది: కుంబ్లే

ముంబై:భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లిలో కష్టపడేతత్వాన్ని తాను ఏనాడో చూశానని, అదే ఈ రోజు అతన్ని సారథిగా నిలబెట్టిందని కొనియాడాడు. విరాట్ కోహ్లి యువకుడిగా ఉన్న సమయంలోని అతనిలో పట్టుదల చూసినట్లు కుంబ్లే పేర్కొన్నాడు.

'కోహ్లికి 19 ఏళ్ల వయసులో అతనిలో కొన్ని లక్షణాలు నన్ను ఆకర్షించాయి.  అతని నేతృత్వంలోని భారత్ అండర్-19 జట్టు వరల్డ్ కప్ గెలిచిన తరువాత కోహ్లిని తొలిసారి చూశా. రాయల్ చాలెంజర్స్ కు ఆడుతున్న సమయంలో కోహ్లి నడుచుకుంటూ వెళుతున్నాడు.అది అతన్ని మొదటిసారి చూడటం. ఆ సయమంలో అతను గేమ్ ను అభివృద్ధి చేసుకోవడం కోసం పడే తాపత్రాయం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. విరాట్ కోహ్లి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం. అతనొక బ్రిలియంట్ క్రికెటర్'అని కుంబ్లే పేర్కొన్నాడు. మరొకవైపు రాంచీ నుంచి వచ్చి టీమిండియాకు పదేళ్లు కెప్టెన్ గా పని చేసిన మహేంద సింగ్ ధోనిపై కూడా కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి ఒక క్రికెటర్ రావడమే కాకుండా, దశాబ్దం పాటు సారథిగా చేయడం సాధారణ విషయం కాదన్నాడు. క్రికెట్ కు అచ్చమైన అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ధోనినేనని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.

ఇదిలా ఉంచితే, కోచ్ గా తాను కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లు కుంబ్లే తెలిపాడు. ఒక ఆటగాడ్ని ఫలానా మ్యాచ్ లో వేసుకోవడం లేదనే విషయాన్ని అతనికి చెప్పడం చాలా కష్టంగా ఉందన్నాడు. 'నువ్వు ఆడటం లేదని కానీ, నువ్వు స్క్వాడ్ లో లేవను కానీ ఆటగాళ్లకు చెప్పడం 'కోచ్ గా విపరీతమైన కష్టంగా ఉందన్నాడు. అయితే నాణ్యమైన జట్టు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నాడు.

Advertisement
Advertisement