టైటిల్‌ పోరుకు  లక్ష్య సేన్‌ 

Lakshya Sen Storms Through to Asia Junior Championships Final - Sakshi

జకార్తా: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం లక్ష్య సేన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో శనివారం జరిగిన సెమీఫైనల్లో ఆరోసీడ్‌ లక్ష్య సేన్‌ 21–7, 21–14తో రెండో సీడ్‌ లియోనార్డో ఇమాన్యూయేల్‌ రామ్‌బే (ఇండోనేసియా)పై వరుస సెట్లలో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. 40 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో దూకుడైన ఆటతీరుతో రెచ్చిపోయిన లక్ష్య సేన్‌ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసిన రామ్‌బే రెండో గేమ్‌లో పోరాట పటిమ కనబర్చినా లక్ష్య సేన్‌ దాడుల ముందు అది నిలువలేదు.

నేడు జరుగనున్న ఫైనల్లో టాప్‌సీడ్‌ కున్‌లవుత్‌ వితిద్‌సరన్‌ (ఇండోనేసియా)తో లక్ష్య సేన్‌ తలపడనున్నాడు. మరో సెమీస్‌లో కున్‌లవుత్‌ 21–14, 21–12తో యూపెంగ్‌ బై (చైనా)పై గెలిచి తుదిపోరుకు చేరాడు. ‘ఫైనల్‌ చేరడం సంతోషంగా ఉంది. నా ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నా. ఫైనల్లో ఇదే జోరు కొనసాగిస్తా. టాప్‌సీడ్‌తో ఆడే సమయంలో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషిచేస్తా’ అని సెమీస్‌ మ్యాచ్‌ అనంతరం లక్ష్య సేన్‌ అన్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top