గంగూలీ వాదనకు కాంబ్లీ నో!

Kambli disagrees with Gangulys same players in all formats idea - Sakshi

న్యూఢిల్లీ: మూడు ఫార్మాట్లకు ఒకే జట్టును ప్రకటిస్తే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి వారి నుంచి మంచి ప్రదర్శన రావడానికి ఆస్కారం ఉందన్న టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వాదనతో మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఏకీభవించలేదు. వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టు ఎంపిక సరిగా లేదంటూ పేర్కొన్న గంగూలీ.. అన్ని ఫార్మాట్లకు కలిపి ఒకే జట్టును పంపిస్తే బాగుండేదన్నాడు. అయితే దీనిపై కాంబ్లీ స్పందిస్తూ.. ఇది సరైన విధానం కాదన్నాడు. ‘ ప్రతీ ఫార్మాట్‌లో గెలుపు గుర్రాలు అనేవి వేరుగా ఉంటాయి.  ఏ ఫార్మాట్‌లో ఆటగాళ్లు మెరుగనిస్తే వారిని ఎంపిక చేయాలి. అది జట్టుకు లాభిస్తుంది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేయడం తప్పుకాదు. ఇలా ఎంపిక చేయడం వల్ల ప్రధాన సిరీస్‌ల్లో ఎవరిని ఏ సందర్భంలో వాడుకోవాలో అనే విషయం తెలుస్తుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్లే ఇందుకు ఉదాహరణ’ అని కాంబ్లీ పేర్కొన్నాడు.

ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని జాతీయ సెలక్టర్ల బృందం విండీస్‌ టూర్‌కు ఆదివారం మూడు ఫార్మాట్లకు విడి విడిగా జట్టును ప్రకటించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా మాత్రమే మూడు ఫార్మాట్లలో స్థానం దక్కించుకున్నారు. రాహుల్‌ చహర్‌(స్పిన్‌), నవదీప్‌ సైనీ(పేసర్‌)లకు తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వెస్టిండీస్‌-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత మూడు ఇన్నింగ్స్‌లో వరుస అర్ధసెంచరీలు సాధించి సత్తా చాటినా సెలెక్టర్లు అతడిని పట్టించుకోకపోవడం గమనార్హం. (ఇక్కడ చదవండి: ఎందుకలా..?: గంగూలీ ఆశ్చర్యం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top