‘వండర్’సన్ | Sakshi
Sakshi News home page

‘వండర్’సన్

Published Mon, May 26 2014 12:53 AM

‘వండర్’సన్

కోరె అండర్సన్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట లిఖించుకున్న ఈ కివీస్ ఆటగాడు ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్‌కు పెద్దగా ఉపయోగపడింది లేదు. కానీ ప్రత్యర్థి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రేంజిలో కీలక మ్యాచ్‌లో చెలరేగాడు. దీంతో లీగ్‌లో పడుతూ లేస్తూ తన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై అత్యంత నాటకీయ పరిస్థితుల్లో ప్లే ఆఫ్ దశకు చేరుకుంది.
 
 ముంబై: టి20 క్రికెట్‌లో ఏదీ అసాధ్యం కాదేమో... ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకోవాలంటే 14.3 ఓవర్లలోనే 190 పరుగులు చేయాలి. ముంబైకి చావో రేవోగా నిలిచిన ఈ మ్యాచ్‌లో కోరె అండర్సన్ (44 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) లీగ్‌లో తొలిసారిగా విశ్వరూపం ప్రదర్శించాడు.
 
 
 శనివారం మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్ విధ్వంసాన్ని మరిపించే రీతిలో కొనసాగిన ఈ విలయ తాండవంతో... ఛేదించడం సాధ్యమేనా అనుకున్న లక్ష్యాన్నికాస్తా పిడుగుల్లాంటి షాట్లతో 14.4 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసి జట్టును సంబరాల్లో ముంచాడు. దీంతో వాంఖడే మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్‌ను 5 వికెట్ల తేడాతో గెల్చుకుంది.
 
  ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 189 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (47 బంతుల్లో 74; 7 ఫోర్లు; 3 సిక్సర్లు), కరుణ్ నాయర్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ముంబై 14.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 195 పరుగులు చేసి నెగ్గింది.  హస్సీ (11 బంతుల్లో 22; 1 ఫోర్; 2 సిక్సర్లు) ఆకట్టుకోగా చివర్లో అంబటి రాయుడు (10 బంతుల్లో 30; 5 ఫోర్లు; 1 సిక్స్) జట్టుకు ఉపయోగపడ్డాడు. కులకర్ణి, కూపర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండర్సన్‌కు దక్కింది.
 
 ఆరంభంలో నెమ్మదించినా..
 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (18 బంతుల్లో 8; 1 ఫోర్) పరుగులు తీసేందుకు తెగ ఇబ్బంది పడ్డాడు. బుమ్రా తొలి ఓవర్‌ను మెయిడిన్ వేయగా అటు మరో ఓపెనర్ సంజూ సామ్సన్ మాత్రం బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఆరో ఓవర్‌లో వాట్సన్ అవుటైన అనంతరం మ్యాచ్ స్వరూపం మారింది.

కరుణ్ నాయర్‌తో కలిసి సామ్సన్ ఇన్నింగ్స్‌ను పట్టాలెక్కించాడు. 11వ ఓవర్‌లో నాయర్ విజృంభించి 6,4,4,4తో 19 పరుగులు రాబట్టాడు. ఇదే జోరుతో 26 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన అనంతరం అవుటయ్యాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 57 బంతుల్లో 100 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత ఓవర్‌లోనే సామ్సన్ వెనుదిరిగినా రాజస్థాన్ దూకుడు తగ్గలేదు.

 బ్రాడ్ హాడ్జ్ (16 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్), ఫాల్క్‌నర్ (12 బంతుల్లో 23; 3 సిక్సర్లు) చివరి 27 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరును అందించారు.
 
 వారెవ్వా అండర్సన్
 గెలిచేందుకు కావాల్సిన రన్‌రేట్‌ను దృష్టిలో ఉంచుకుని బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అదే స్థాయిలో తమ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. తొలి ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన సిమ్మన్స్ (8 బంతుల్లో 12; 3 ఫోర్లు) మరుసటి ఓవర్‌లో అవుటైనా అండర్సన్, హస్సీ (11 బంతుల్లో 22; 1 ఫోర్; 2 సిక్సర్లు) ఏమాత్రం తగ్గలేదు. మూడో ఓవర్‌లో 15, నాలుగో ఓవర్‌లో 19 పరుగులు సాధించి జోష్‌లో ఉన్న ముంబైని కూపర్ నేలకు దించాడు. ఐదో ఓవర్‌లో హస్సీ, పొలార్డ్ (3 బంతుల్లో 7; 1 సిక్స్)ను అవుట్ చేసి షాకిచ్చాడు. అయితే పవర్ ప్లే ముగిసే సరికి ముంబై 71 పరుగులు సాధించింది.
 
 అండర్సన్ మాత్రం కసిదీరా బ్యాట్‌ను ఝుళిపించాడు. దీంతో తొమ్మిదో ఓవర్‌లోనే జట్టు వంద పరుగుల మార్కును దాటగా... అతను 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. వాట్సన్ వేసిన 12వ ఓవర్‌లో రాయుడు వరుసగా మూడు ఫోర్లతో విజృంభించాడు.
 
 ఇక తమ టార్గెట్‌ను పూర్తి చేయాల్సిన 15వ ఓవర్‌లో అందరి ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సిన దశలో తొలి బంతికి అండర్సన్ సింగిల్ తీశాడు. రెండో బంతిని రాయుడు సిక్స్ బాదడంతో ముంబై ఆనందంలో మునిగింది. అయితే ఒక్క బంతికి రెండు పరుగులు రావాల్సిన దశలో సింగిల్ తీసిన అనంతరం రాయుడు రనౌట్ అయ్యాడు.
 
 దీంతో ఫలితం ఏమిటో అర్థం కాక స్టేడియంలో అయోమయం నెలకొంది. అయితే కొంత సమయం తర్వాత మరుసటి బంతికి ఫోర్ సాధిస్తే ముంబై ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుందని ప్రకటించారు. దీంతో ఆదిత్య తారే సిక్స్‌గా మలిచి మైదానాన్ని హోరెత్తించాడు.
 
 స్కోరు వివరాలు
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 8; సామ్సన్ (సి) హర్భజన్ (బి) గోపాల్ 74; కరుణ్ (సి) సిమ్మన్స్ (బి) బుమ్రా 50; హాడ్జ్ నాటౌట్ 29; ఫాల్క్‌నర్ (సి) అండర్సన్ (బి) పొలార్డ్ 23; కూపర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 2, వైడ్లు 3) 5; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 189.
 
 వికెట్ల పతనం: 1-34; 2-134; 3-136; 4-185.
 బౌలింగ్: అండర్సన్ 2-0-14-0; బుమ్రా 4-1-30-1; ఓజా 4-0-31-0; హర్భజన్ 4-0-43-1; గోపాల్ 3-0-36-1; పొలార్డ్ 3-0-33-1.
 
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) ఫాల్క్‌నర్ (బి) కులకర్ణి 12; హస్సీ (బి) కూపర్ 22; అండర్సన్ నాటౌట్ 95; పొలార్డ్ (సి) హాడ్జ్ (బి) కూపర్ 7; రోహిత్ (సి) నాయర్ (బి) కులకర్ణి 16; రాయుడు (రనౌట్) 30; తారే నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 3, వైడ్లు 4) 7; మొత్తం (14.4 ఓవర్లలో 5 వికెట్లకు) 195.
 
 వికెట్ల పతనం: 1-19; 2-53; 3-61; 4-108; 5-189.
 బౌలింగ్: ఫాల్క్‌నర్ 3.4-0-54-0; కులకర్ణి 3-0-42-2; వాట్సన్ 2-0-33-0; కూపర్ 4-0-38-2; తాంబే 2-0-25-0.
 

Advertisement
Advertisement