‘ఎలైట్‌ ప్యానెల్‌’లో నితిన్‌ 

Indian Umpire Nitin Narendra Menon Got Chance In Elite Panel Of Umpires - Sakshi

ఈ ఘనత దక్కించుకున్న మూడో భారత అంపైర్‌  

దుబాయ్‌: భారత అంపైర్‌ నితిన్‌ నరేంద్ర మేనన్‌కు అరుదైన అవకాశం లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అగ్రశ్రేణి అంపైర్ల జాబితా అయిన ‘ఎలైట్‌ ప్యానెల్‌ ఆఫ్‌ అంపైర్స్‌’లో ఆయనకు చోటు దక్కింది. భారత్‌ నుంచి గతంలో ఇద్దరు మాత్రమే ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్లుగా వ్యవహరించారు. శ్రీనివాసన్‌ వెంకట్రాఘవన్‌ (2002–04), సుందరం రవి (2010–19) గతంలో ఈ బాధ్యతను నిర్వర్తించారు. ఇంగ్లండ్‌కు చెందిన నైజేల్‌ లాంజ్‌ స్థానంలో 36 ఏళ్ల నితిన్‌ ప్యానెల్‌లోకి వచ్చారు. ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ జెఫ్‌ అలార్డిస్, రంజన్‌ మదుగలే, డేవిడ్‌ బూన్, సంజయ్‌ మంజ్రేకర్‌ల బృందం నితిన్‌ను ఎంపిక చేసింది. 12 మంది సభ్యుల ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్ల జాబితాలో ఇప్పుడు అందరికంటే పిన్న వయస్కుడు నితిన్‌ కావడం విశేషం.

ఇండోర్‌కు చెందిన నితిన్‌ మధ్యప్రదేశ్‌ జట్టు తరఫున 2 దేశవాళీ వన్డేలు ఆడారు. 2017లో అంతర్జాతీయ అంపైర్‌గా కెరీర్‌ మొదలు పెట్టారు. తన మూడేళ్ల అంతర్జాతీయ అంపైరింగ్‌ కెరీర్‌లో ఆయన 3 టెస్టులు, 24 వన్డేలు, 16 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. 10 మహిళల టి20 మ్యాచ్‌లకు కూడా పని చేశారు. ఏడాది కాలంగా ఆయన పనితీరు చాలా బాగుండటాన్ని ఐసీసీ గుర్తించింది. మరోవైపు అందరికంటే ఎక్కువగా 36.2 శాతం తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన నైజేల్‌ లాంజ్‌ చోటు కోల్పోవాల్సి వచ్చింది. తనకు ఈ అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నితిన్‌... మరింత సమర్థంగా పని చేసి అంపైరింగ్‌పై విశ్వాసం పెరిగేలా చేస్తానని అన్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top