భారత్‌ ఫటాఫట్‌... 

India sporting gesture toward Afghan team - Sakshi

చారిత్రక పోరులో ఇన్నింగ్స్‌ 262 పరుగుల తేడాతో ఘనవిజయం

ఒకే రోజు ముగిసిన   అఫ్గాన్‌ రెండు ఇన్నింగ్స్‌లు

67 ఓవర్లలో చుట్టేసిన భారత బౌలర్లు

ఒకే రోజు కూలిన 24 వికెట్లు 

ఐసీసీ టెస్టు హోదానిచ్చింది. ఐపీఎల్‌ ఎక్కడలేని ఆత్మ విశ్వాసాన్నిచ్చింది. దీంతో ఇంకేముందిలే అనుకుంది అఫ్గానిస్తాన్‌. చారిత్రక టెస్టుకు ఉత్సాహంగా సిద్ధమైంది. ఉపఖండం స్పిన్‌ పిచ్‌లపై మా వాళ్లు తిప్పేస్తారని కొండంత ఆశలు పెట్టుకుంది. తీరా... బరిలోకి దిగితే గానీ అసలు ‘టెస్టు’ అర్థమైంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు... సంప్రదాయ టెస్టులకు చాంతాడంత వ్యత్యాసముందని ప్రాక్టికల్‌గా తెలుసుకుంది. ఐదు రోజుల ఆట రెండు రోజుల్లో ముగియడంతో క్రికెట్‌ కథకమామిషు... మనకి తెలిసింది గోరంతని ఇంకా తెలుసుకోవాల్సింది కొండంతని అఫ్గాన్‌కు బోధపడింది.   

బెంగళూరు: చారిత్రక టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు నమోదైతే... మరో జట్టు మొత్తం ఇన్నింగ్స్‌ అంతా కలిపి సెంచరీకి మించింది అంతే.  ధావన్, మురళీ విజయ్‌ సెంచరీలకు ఇంచుమించుగా సమంగా ఉండే రెండు ఇన్నింగ్స్‌లు అఫ్గానిస్తాన్‌  ఆడింది. కాకతాళీయమో... యాదృచ్ఛికమో కానీ తొలిరోజు రెండు, రెండో రోజు రెండు ‘వంద’లు దాటాయి. రెండో రోజే ముగిసిన ఈ టెస్టులో టీమిండియా అద్వితీయ ప్రదర్శనతో చరిత్ర పుటలకెక్కింది. ఈ రెండు రోజులు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌ చేయలేక గజగజ వణికింది. తొలిరోజు ధావన్‌ ‘సెషన్‌’ సెంచరీ రికార్డయితే... రెండో రోజు టెస్టు చరిత్రలో ఒకే రోజు 20 వికెట్లు తీసిన జట్టుగా భారత్‌ రికార్డులకెక్కింది. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో  జరిగిన ఏకైక టెస్టులో రహానే సేన ఇన్నింగ్స్‌ 262 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లు పూర్తిగా శ్రమించకుండానే అఫ్గానిస్తాన్‌ రెండు సార్లు ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి జడేజా 6, అశ్విన్‌ 5 వికెట్లు తీయగా, పేసర్లు ఉమేశ్, ఇషాంత్‌ శర్మ చెరో 4 వికెట్లు తీశారు. దీంతో అఫ్గానిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ను 109 పరుగుల వద్ద, ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్‌ను 103 పరుగుల వద్ద ముగించింది. శిఖర్‌ ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

పాండ్యా ఫిఫ్టీ... 
ఓవర్‌నైట్‌ స్కోరు 347/6తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 104.5 ఓవర్లలో 474 పరుగుల వద్ద ఆలౌటైంది. హార్దిక్‌ పాండ్యా (94 బంతుల్లో 71; 10 ఫోర్లు) టెయిలెండర్ల సాయంతో భారత్‌ స్కోరును పెంచాడు. అశ్విన్‌ (18) ఆట మొదలైన కాసేపటికే నిష్క్రమించగా, జడేజా (20; 1 ఫోర్, 1 సిక్స్‌) అండతో జట్టు స్కోరును 400 పరుగులకు చేర్చాడు. ఈ క్రమంలో పాండ్యా 83 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఉమేశ్‌ (21 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో స్కోరు బోర్డు వేగం పుంజుకుంది. ఇషాంత్‌ను రషీద్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.  

అఫ్గాన్‌ ఆలౌట్‌... ఆలౌట్‌... 
తొలిరోజు  ఫీల్డింగ్‌ను ఎలా మొహరించాలో తెలియక తల్లడిల్లిన అఫ్గానిస్తాన్‌ రెండో రోజు బ్యాటింగ్‌ చేసేందుకూ విలవిల్లాడింది. దీంతో లంచ్‌లోపే తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత బౌలర్లలో ఏ ఒక్కరు కనీసం పదో ఓవర్‌ అయిన వేయక ముందే... అఫ్గాన్‌ 27.5 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. మొహమ్మద్‌ నబీ (24) టాప్‌ స్కోరర్‌ కాగా... భారత బౌలర్లు వేసిన మొత్తం ఓవర్లకంటే కూడా నబీ స్కోరు తక్కువే. అశ్విన్‌ (4/27), ఇషాంత్‌ (2/28), జడేజా (2/18) ఇంకెవరికీ నబీని చేరే ఛాన్స్‌ ఇవ్వలేదు. దీంతో భారత్‌కు 365 పరుగుల ఆధిక్యం లభించింది. అఫ్గాన్‌ ఫాలోఆన్‌ ఆడింది. 

వంద దాటగానే... మళ్లీ 
ఫాలోఆన్‌ ఆడిన అఫ్గానిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసింది. ఇద్దరు మినహా, మిగతావారంతా టెస్టుకు కావాల్సిన ఓపికను, సహనాన్ని ఏ దశలోనూ కనబర్చలేకపోయారు. మిడిలార్డర్‌లో షాహిది (88 బంతుల్లో 36 నాటౌట్‌; 6 ఫోర్లు), అస్గర్‌ స్తానిక్‌జై (58 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఉన్నంత సేపు అఫ్గానిస్తాన్‌ టెస్టు ఆడుతున్నట్లు కనిపించింది. కానీ ఇంకెవరూ టెస్టులకు సరితూగే ఆటను ఆడలేకపోయారు. జడేజా (4/17), ఉమేశ్‌ (3/26), ఇషాంత్‌ (2/17)ల బౌలింగ్‌కు తేలిగ్గానే తలవంచారు. 

రహానే క్రీడాస్ఫూర్తి... 
చారిత్రక టెస్టును ఫటాఫట్‌గా ముగించిన భారత జట్టు ప్రత్యర్థిని గౌరవించి క్రీడాస్ఫూర్తిలోనూ గెలిచింది. రహానే ట్రోఫీని అందుకున్న తర్వాత టీమిండియా సహచరులతో కలిసి ఫొటోకు ఫోజిచ్చాడు. తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లను సాదరంగా ఆహ్వానించి ట్రోఫీతో ఉమ్మడిగా ఫొటో దిగారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top