టీమిండియా గెలిస్తే అదుర్సే..

India Aim To Rewrite History After Being Blown Away For 165 - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టును టీమిండియా గెలిస్తే కొత్త చరిత్ర లిఖించబడుతుంది. కివీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 165 పరుగులకే చాపచుట్టేసింది. అజింక్యా రహానే(46), మయాంక్‌ అగర్వాల్‌(34), మహ్మద్‌ షమీ(21)లు మోస్తరుగా ఆడటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరునైనా సాధించకల్గింది. కాగా, ఓవరాల్‌గా భారత క్రికెట్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులు, అంతకంటే తక్కువ పరుగులు చేయడం 59 టెస్టుల్లో  జరిగితే, విదేశాల్లో(ప్రస్తుత మ్యాచ్‌ను మినహాయించి) 29వ టెస్టు. అయితే ఇక్కడ ఏ ఒక్క టెస్టును టీమిండియా గెలిచిన సందర్భాలు లేవు. ఇలా మొదటి ఇన్నింగ్స్‌లో 165, అంతకంటే తక్కువ పరుగులు నమోదు చేసిన అన్ని సందర్భాల్లో భారత్‌ను ఎక్కువ శాతం పరాజయమే ఎక్కిరించింది. 59 టెస్టుల్లో 40 కోల్పోతే, 16 డ్రాగా ముగిసాయి. మరో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే టీమిండియా విజయం సాధించింది. ఇక విదేశాల్లో 165, అంతకంటే తక్కువ పరుగుల్ని ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో టీమిండియా నమోదు చేసినప్పుడు అసలు విజయమే లేదు. ఆ 29 టెస్టుల్లో 23 మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూస్తే, 6 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. (ఇక్కడ చదవండి: రహానే కోసం పంత్‌ వికెట్‌ త్యాగం..)

దాంతో న్యూజిలాండ్‌తో తాజా టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే కచ్చితంగా అదుర్సే అవుతుంది. మరి కోహ్లి నేతృత్వంలోని టీమిండియా గెలిచి కొత్త చరిత్రను లిఖిస్తుందో లేక పాత చరిత్రను రిపీట్‌ చేస్తుందో చూడాలి. ఇక కివీస్‌తో తొలి టెస్టు డ్రా అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నాయి. ఇక్కడ టీమిండియాకు ఐదు శాతమే మాత్రమే విజయావకాశాలు ఉండగా, న్యూజిలాండ్‌ గెలవడానికి 70 శాతం అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఏమైన అద్భుతాలు జరిగితే తప్ప డ్రా అయ్యే అవకాశాలు లేవనేది వారి వాదన. ఇక వెల్లింగ్టన్‌ టెస్టులో భారత్‌ ఓడిపోతే మాత్రం టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రవేశపెట్టిన తర్వాత భారత్‌కు ఎదురయ్యే తొలి ఓటమి అవుతుంది. గతేడాది చివర్లో ఆ చాంపియన్‌షిప్‌ ఆరంభమయ్యాక భారత్‌ వరుసగా ఏడు విజయాలను నమోదు చేసింది. ప్రస్తుతం 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. (ఇక్కడ చదవండి: కోహ్లి కెప్టెన్సీలో ‘చెత్త’ ఇన్నింగ్స్‌!)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top