క్వార్టర్స్‌కు హైదరాబాద్‌ | Hyderabad makes it to Elite group in CK Nayudu Trophy | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌కు హైదరాబాద్‌

Nov 27 2017 10:37 AM | Updated on Sep 4 2018 5:32 PM

Hyderabad makes it to Elite group in CK Nayudu Trophy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్నల్‌ సీకే నాయుడు అండర్‌– 23 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ప్లేట్‌ గ్రూప్‌ ‘బి’ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా జింఖానా మైదానంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్‌ డ్రా చేసుకుంది. దీంతో హైదరాబాద్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌ ‘బి’లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ 2 గెలిచి, 3 డ్రా చేసుకుని 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆలిండియా నాకౌట్‌ దశకు అర్హత సాధించిన హైదరాబాద్‌ జట్టు సభ్యులకు రూ. 50 వేల చొప్పున నగదు పురస్కారాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది.   

ఆట చివరిరోజు ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 271/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర 137.5 ఓవర్లలో 462 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్‌కు 202 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ యశ్‌ పరేఖ్‌ (73; 11 ఫోర్లు, 1 సిక్స్‌), పార్థ్‌ చౌహాన్‌ (50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లతో పాటు యువరాజ్‌ (73 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ బౌలర్లలో కార్తికేయ 4 వికెట్లతో చెలరేగగా, వై. శ్రవణ్‌ కుమార్‌ 3 వికెట్లు దక్కించుకున్నాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి 21.5 ఓవర్లలో 2 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఓపెనర్‌ కె. నితీశ్‌రెడ్డి (69 బంతుల్లో 55; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), చందన్‌ సహాని (49 బంతుల్లో 57 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు.  అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 664 పరుగులకు ఆలౌటైంది. ఈనెల 29 నుంచి జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తమిళనాడుతో హైదరాబాద్‌ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement