భారత్ శుభారంభం | Hockey World League Semifinals - India vs France - The Times of India | Sakshi
Sakshi News home page

భారత్ శుభారంభం

Jun 21 2015 1:00 AM | Updated on Sep 3 2017 4:04 AM

భారత్ శుభారంభం

భారత్ శుభారంభం

చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్

ఫ్రాన్స్‌పై 3-2తో గెలుపు   హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్
 
 యాంట్‌వర్ప్ (బెల్జియం): చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో విజయంతో శుభారంభం చేసింది. శనివారం జరిగిన పురుషుల విభాగం గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ జట్టును ఓడించింది. పలు మలుపులు తిరిగిన ఈ పోటీలో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా రమణ్‌దీప్ సింగ్ ఫీల్డ్ గోల్‌తో భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆట మూడో  నిమిషంలోనే శాంచెజ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది.
 
  అయితే రెండో క్వార్టర్‌లో భారత్ అనూహ్యంగా పుంజుకుంది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసింది. 26వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను మన్‌ప్రీత్ సింగ్ లక్ష్యానికి చేర్చగా... 29వ నిమిషంలో దేవేందర్ వాల్మీకి ఫీల్డ్ గోల్‌తో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మిడ్ ఫీల్డ్ నుంచి బంతిని తీసుకెళ్లిన సర్దార్ సింగ్ సర్కిల్‌లో ఉన్న ధరమ్‌వీర్ సింగ్‌కు పాస్ అందించాడు. ధరమ్‌వీర్ నుంచి బంతిని అందుకున్న దేవేందర్ వాల్మీకి కళ్లు చెదిరే షాట్‌తో ఫ్రాన్స్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించాడు.
 
  మూడో క్వార్టర్‌లో 43వ నిమిషంలో మార్టిన్ గోల్‌తో ఫ్రాన్స్ స్కోరును సమం చేసింది. దాంతో నిర్ణాయక నాలుగో క్వార్టర్ కీలకంగా మారింది. ఈ క్వార్టర్‌లో రెండు జట్ల ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. మ్యాచ్ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా రమణ్‌దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ను గెలిపించాడు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్‌లు రాగా దాంట్లో ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. కెప్టెన్ సర్దార్ సింగ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన, గోల్‌కీపర్ శ్రీజేష్ అప్రమత్తత కూడా భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో పోలండ్‌తో భారత్ తలపడుతుంది.
 
 మహిళల జట్టు ఓటమి: అయితే భారత మహిళల జట్టుకు మాత్రం తొలి మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. ఆతిథ్య బెల్జియం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 0-1 తేడాతో ఓటమి పాలైంది. గోల్స్ చేసేందుకు పలుమార్లు అవకాశాలు వచ్చినా భారత క్రీడాకారిణులు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. అంతకుముందు ఆట 35వ నిమిషంలో బెల్జియం కెప్టెన్ లీసెలోట్టి వాన్ లిండ్ట్ గోల్ చేసి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత భారత్ స్కోరును సమం చేసేందుకు కృషి చేసినా ఫలితం లేకపోయింది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement