ఫుట్‌బాల్‌తో మెదడుకు డేంజర్‌ | Heading a Football is a Dangerous to Brain: Study | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ ఆటతో మెదడుకు జబ్బులు

Oct 29 2019 7:36 PM | Updated on Oct 29 2019 7:36 PM

Heading a Football is a Dangerous to Brain: Study - Sakshi

ఫుట్‌బాల్‌ క్రీడకు సంబంధించి ఓ ప్రమాదకరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

న్యూఢిల్లీ : సాకర్‌గా పిలిచే ఫుట్‌బాల్‌ ఆట పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో క్రేజీ ఉన్న విషయం తెల్సిందే. అందుకు కారణం ప్రత్యర్థి పద్మ వ్యూహాలను తప్పించుకుంటూ క్రీడాకారులు ఫుట్‌బాల్‌ను పాదాలతో, మోకాళ్లతో గోల్‌వైపు తీసుకెళ్లి కాళ్లతోనో, తలతోనో గోల్‌ చేయడం ఉత్కంఠను రేపుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘పీలే’ లాగే వెనుతిరిగి రివర్స్‌ కిక్‌ కొడితే ఉత్సాహం రెండింతలు అవుతుంది. ఫుట్‌బాల్‌ క్రీడకు సంబంధించి ఓ ప్రమాదకరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

క్రీడాకారులు తలతో ఫుట్‌బాల్‌ను కొట్టడం వల్ల సామాన్యులకన్నా మూడున్నర రెట్లు ఎక్కువగా మెదడు జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఫుట్‌బాలర్లపైన అధ్యయనం జరిపిన ప్రముఖ డాక్టర్‌ బెన్నెట్‌ ఒమలు కనుగొన్నారు. అందుకని ఫుట్‌ బాల్‌ క్రీడలో తలతో బాల్‌ను కొట్టడాన్ని నిషేధించాలని, అది సాధ్యం కాకపోతే కనీసం 18 లోపు పిల్లలు అలా చేయకుండా నిబంధన విధించాలని ఆయన ప్రపంచ క్రీడాధికారులకు పిలుపు ఇచ్చారు. క్రీడల్లో రాణించడం కోసం చిన్న పిల్లలప్పటి నుంచి ఫుడ్‌బాల్‌ నేర్పిస్తున్నారని, అందులో భాగంగా వారు తలతో బాల్‌ను కొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు మెదడు సంపూర్ణంగా అభివృద్ధి చెందదని, ఫుట్‌బాల్‌ దెబ్బల వల్ల వారిలో మెదడు అభివృద్ధి మందగిస్తుందని ఆయన హెచ్చరించారు.

తలవొంచి బాల్‌ను కొట్టినప్పుడల్లా మెదడుకు కనిపించనంత సూక్ష్మ స్థాయిలో గాయం అవుతుందని, ఊహాత్మకంగా చెప్పడం లేదని సైంటిఫిక్‌గా చెబుతున్నానని ఆయన తెలిపారు. ఫుట్‌బాల్‌ను కొట్టేటప్పుడు తల అటూ ఇటు తిప్పుతారని, అప్పుడు కపాలం లోపల మెదటు అటూ ఇటూ ఊగుతుందని, ఫుట్‌బాల్‌ తగిలినప్పుడల్లా మెదడుకు ఒక చోట కాకుండా పలు చోట్ల గాయాలు అయ్యే ప్రమాదం ఉందని, తొలుత దీని ప్రభావం పెద్దగా కనిపించక పోవచ్చని, గాయాలు పెరిగినప్పుడు, వయస్సు మీరినప్పుడు మెదడుకు సంబంధించిన సమస్యలు వేధిస్తాయని ఆయన చెప్పారు.

ఫుట్‌బాల్‌ వల్ల రిస్క్‌ ఉందనే విషయం 2002లో ప్రముఖ అమెరికా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ మైక్‌ వెబ్‌స్టర్‌కు అటాప్సీ చేసినప్పుడు ఆయన మెదడులో వచ్చిన మార్పులు గమనించానని అప్పటికే న్యూరాలజిస్ట్‌ అయిన బెన్నెట్‌ చెప్పారు. ఆయన 50 ఏళ్లకు మరణించాడని, అప్పటికే ఆయన మెదడులో అన్ని మార్పులు రాకూడదని ఆయన అన్నారు. మెదడుకు పునరుత్పత్తి లక్షణం లేదుగనుక దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఆ తర్వాత చాలా మంది ఫుట్‌బాలర్లపై పరీక్షలు జరపగా, వారిలో కొందరికి ‘క్రానిక్‌ ట్రామాటిక్‌ ఎన్సిఫాలోపతి’ ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. దీనివల్ల డిమెన్షియా కూడా వస్తుందని ఆయన హెచ్చరించారు. తన హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్న అమెరికా సాకర్‌ ఫెడరేషన్, 11 ఏళ్ల లోపు పిల్లలు తలతో ఫుట్‌బాల్‌ ఆడకుడదంటూ నిషేధం విధించిందని, 11 నుంచి 13 ఏళ్ల పిల్లలు పరిమితంగా ఆడాలంటూ ఆంక్షలు విధించిదని డాక్టర్‌ బెన్నెట్‌ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్శిటీలోని మెడికల్‌ పాథాలజీ విభాగంలో అసోసియేట్‌ క్లినికల్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement