ఐపీఎల్‌: గేల్‌ దుమారం | Gayle century helps Kings Punjab to 193 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌: గేల్‌ దుమారం

Apr 19 2018 9:47 PM | Updated on Apr 19 2018 10:57 PM

Gayle century helps Kings Punjab to 193 - Sakshi

మొహాలీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రిస్‌ గేల్‌ మరోసారి వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడటంతో కింగ్స్‌ భారీ స్కోరు నమోదు చేసింది.  కేవలం 1 ఫోర్‌ మాత్రమే సాధించిన గేల్‌.. సిక్సర్ల మోత మోగించాడు. ఏకంగా 11 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఫలితంగా 63 బంతుల్లో గేల్‌ అజేయంగా 104 పరుగులు సాధించాడు. ఇది ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తొలి శతకంగా లిఖించబడింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కింగ్స్‌కు ఓపెనర్లు క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరూ కుదురుగా ఆడుతూ జట్టు స్కోరును ఎనిమిదో ఓవర్‌లో యాభై పరుగులు దాటించారు. అయితే జట్టు స్కోరు 53 పరుగుల వద్ద రాహుల్‌(18) వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై కాసేపటికి మయాంక్‌ అగర్వాల్‌ కూడా ఔట్‌ కావడంతో పంజాబ్‌ 83 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. కాగా, అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న గేల్‌ చెలరేగి పోయాడు. ప్రధానంగా కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా 10 ఓవర్‌ దాటిన తర్వాత గేల్‌ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం సిక్సర్లపైనే దృష్టి పెట్టిన గేల్‌ విధ్వంసకర ఆటతో మైమరిపించాడు.

సన్‌రైజర్స్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వరుసగా  నాలుగు సిక్సర్లు కొట్టి తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపెట్టాడు. అతనికి జతగా కరుణ్‌ నాయర్‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అరోన్‌ ఫించ్‌(14 నాటౌట్‌, 6 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) సమయోచితంగా ఆడటంతో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 193 పరుగులు సాధించింది. హైదరాబాద్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌, సిద్ధార్ధ్‌ కౌల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లకు మాత్రమే తలో వికెట్‌ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement