సింగిల్స్‌ చాంప్‌ గాయత్రి | gayatri gets womens single champion title of all india badminton | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌ చాంప్‌ గాయత్రి

Jun 19 2017 2:43 PM | Updated on Sep 5 2017 1:59 PM

సింగిల్స్‌ చాంప్‌ గాయత్రి

సింగిల్స్‌ చాంప్‌ గాయత్రి

ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి టైటిల్‌తో మెరిసింది.

తిరువనంతపురం: ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి టైటిల్‌తో మెరిసింది. అండర్‌–17 బాలికల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గాయత్రి 21–12, 21–23, 21–6తో చత్తీస్‌గఢ్‌కు చెందిన టాప్‌ సీడ్‌ ఆకర్షి కశ్యప్‌పై విజయం సాధించింది. బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తనయ గాయత్రికి ఒక్క రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇందులోనూ పోరాడినప్పటికీ ఆకర్షి దూకుడుకు తలవంచింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభం నుంచే చెలరేగింది. దీంతో టాప్‌ సీడ్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

 

అండర్‌–17 బాలికల టైటిల్‌ను సాహితి బండి (తెలంగాణ)–వర్షిణి (తమిళనాడు) జోడి గెలుచుకుంది. ఫైనల్లో ఈ మూడో సీడ్‌ జోడి 21–15, 10–21, 21–17తో కెయూర మొపతి– కవిప్రియ (తెలంగాణ) జంటను ఓడించింది. అండర్‌–17 బాలుర సింగిల్స్‌ తుదిపోరులో టాప్‌ సీడ్‌ మైస్నమ్‌ మిరబా 21–12, 21–12తో ధ్రువ్‌ రావత్‌పై నెగ్గాడు. డబుల్స్‌ ఫైనల్లో యశ్‌–ధ్రువ్‌ రావత్‌ 21–14, 10–21, 21–13తో ఎడ్విన్‌ జాయ్‌–అరవింద్‌ సురేశ్‌ జంటపై నెగ్గింది. అండర్‌–19 డబుల్స్‌ ఫైనల్లో రాహుల్‌ భరద్వాజ్‌ 21–15, 21–14తో టాప్‌ సీడ్‌ కార్తీకేయ్‌ కుమార్‌కు షాకిచ్చాడు. అండర్‌–19 బాలికల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో పూర్వ బర్వే 27–25, 21–13తో అశ్విని భట్‌పై, డబుల్స్‌లో మిథుల–రుతపర్ణ పండ 21–14, 21–18తో అశ్విన్‌భట్‌–అపేక్ష నాయక్‌ జంటపై, అండర్‌–19 బాలుర డబుల్స్‌లో సంజయ్‌–సిద్ధార్థ్‌ 15–21, 21–12, 21–18తో సౌరభ్‌– రామ్‌భియా దీప్‌లపై గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement