గాయత్రి డబుల్‌ ధమాకా | gayatri gets double dhamaka | Sakshi
Sakshi News home page

గాయత్రి డబుల్‌ ధమాకా

Aug 7 2017 10:43 AM | Updated on Sep 17 2017 5:16 PM

గాయత్రి డబుల్‌ ధమాకా

గాయత్రి డబుల్‌ ధమాకా

ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి పుల్లెల గాయత్రి సత్తా చాటింది.

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి పుల్లెల గాయత్రి సత్తా చాటింది. తమిళనాడులో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–17 సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ గాయత్రి 21–19, 15–21, 21–18తో టాప్‌ సీడ్‌ ఆకర్షి కశ్యప్‌కు షాకిచ్చింది. డబుల్స్‌ విభాగంలో నగరానికే చెందిన సామియా ఇమాద్‌ ఫరూఖితో జతకట్టిన గాయత్రి ఫైనల్లో 21–19, 17–21, 21–12తో కేయూర మోపాటి–కవిప్రియ (హైదరాబాద్‌) జంటపై గెలుపొందింది. మరోవైపు బాలుర సింగిల్స్‌ విభాగంలో ధ్రువ్‌ రావత్‌ 21–17, 21–19తో అమిత్‌ రాథోడ్‌పై నెగ్గి విజేతగా నిలిచాడు.

డబుల్స్‌ ఫైనల్లో ఖదీర్‌ మొయినొద్దీన్‌ మొహమ్మద్‌–విష్ణువర్ధన్‌ గౌడ్‌ ద్వయం 21–15, 20–22, 21–19తో యశ్‌ రైక్వార్‌–ధ్రువ్‌ రావత్‌ జంటను ఓడించింది. అండర్‌–19 సింగిల్స్‌ విభాగంలో మాల్విక బన్సోడ్, అరింథాప్‌ దాస్‌ గుప్తా టైటిళ్లను సాధించారు. బాలికల ఫైనల్లో మాల్విక 12–21, 21–19, 21–13తో అస్మితాపై, బాలుర ఫైనల్లో అరింథాప్‌ 21–19, 21–16తో సంజయ్‌ ఠాకూర్‌పై గెలుపొందారు. బాలికల డబుల్స్‌ విభాగంలో రుతుపర్ణా పాండ–మిథులా ద్వయం 21–11, 21–15తో సిమ్రన్‌ సింఘి–రితికా ఠాకూర్‌ జంటను ఓడించి విజేతగా నిలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ కేటగిరీలో ధ్రువ్‌–మిథులా జోడీ 21–18, 21–19తో శ్రీకృష్ణ సాయి కుమార్‌–రుతుపర్ణా పాండ జంటపై నెగ్గింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement