‘పిచ్’ నెమ్మదించింది!

‘పిచ్’ నెమ్మదించింది!


అత్యుత్సాహం చూపించని ఫ్రాంచైజీలు

 వేలంలో ఆచితూచి అడుగులు

 

 వేలంలో కొన్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య: 154

 భారత ఆటగాళ్లు: 104 విదేశీ ఆటగాళ్లు: 50

 వేలంలో అయిన ఖర్చు: రూ. 262.60 కోట్లు

 

 సాక్షి క్రీడా విభాగం

 ఐపీఎల్ కోసం గతంలో కనిపించిన ‘వేలం’వెర్రికి ఈ సారి అన్ని ఫ్రాంచైజీలు దూరంగా ఉన్నాయి. ఆటగాళ్ల పేరు ప్రతిష్టలను బట్టి కాకుండా జట్టు కూర్పును దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసుకున్నట్లుగా అర్థమవుతోంది. తమ వద్ద అందుబాటులో ఉన్న డబ్బును కూడా విచ్చలవిడిగా కాకుండా  ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వాడుకున్నాయి.

 

  గతంలో చెన్నై, ముంబైవంటి జట్లు 30కి పైగా ఆటగాళ్ల బృందంతో లీగ్ బరిలోకి దిగేవి. ఇందులో చాలా మంది ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోయేది. రెండేళ్ల క్రితమైతే ముంబై జట్టు లీగ్ మధ్యలో తమ జట్టులో సగం మంది ఆటగాళ్లను జట్టు బస చేసిన హోటల్‌లోనే ఉంచి 15 మందితో మిగతా నగరాల్లోని మ్యాచ్‌లకు వెళ్లింది. ఆటగాళ్ల సంఖ్యను ఈ సారి 27కు పరిమితం చేసినా... ఏ జట్టూ 25 మందికి మించి క్రికెటర్లను తీసుకోకపోవడం విశేషం.

 

 నిలకడే కీలకం...

 గతంలో ఎంత గొప్ప రికార్డు ఉన్నా...ప్రస్తుత ఫామ్‌పైనే ఎక్కువ జట్లు దృష్టి పెట్టాయి. సెహ్వాగ్ విలువ భారీగా తగ్గేందుకు కారణమిదే. యువరాజ్‌కు కూడా ఇటీవల వైఫల్యాలు ఉన్నా, టి20 ఫార్మాట్‌లో అతను ఇప్పటికీ ప్రమాదకరమైన ఆటగాడే. దినేశ్ కార్తీక్‌కు మాత్రం కూసింత అదృష్టం కూడా కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఇవి మినహా ఇతర ఆటగాళ్ల ఎంపిక పూర్తిగా క్యాలిక్యులేటెడ్‌గా సాగిందనే భావించాలి. అండర్సన్ గురించి భారీగా మీడియాలో అంచనాలు పెరిగినా...జట్ల యజమానులు ఎగబడిపోలేదు.  కాబట్టే అతనికి రూ. 4.5 కోట్లు దక్కాయి. ఎప్పుడో మెరుపులు మెరిపించిన దిల్షాన్‌లాంటి ఆటగాళ్లపై కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు. జంబో టీమ్‌ను తీసుకొని డగౌట్‌లో ఖాళీగా కూర్చోబెట్టలేమంటూ తమ ఉద్దేశాన్ని బయట పెట్టాయి.

 

 దేశవాళీ స్టార్లు...

 ఈ సారి వేలానికి వచ్చే ముందు అన్ని జట్లు దేశవాళీ క్రికెటర్ల గురించి కూడా మంచి హోమ్‌వర్క్ చేసినట్లున్నాయి. గత ఏడాది బెస్ట్ అండర్-25 ప్లేయర్ అవార్డు అందుకున్న కరణ్ శర్మ, ఈ ఏడాది రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన కేదార్ జాదవ్, అత్యధిక వికెట్లు తీసిన రిషి ధావన్‌లకు కనిపించిన డిమాండే ఇందుకు ఉదాహరణ. రంజీ ట్రోఫీలో కర్ణాటక విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్‌లకు భారీ మొత్తమే లభించగా...ఈ సీజన్‌లో ఆకట్టుకున్న గౌతమ్, మయాంక్ అగర్వాల్, గురుకీరత్, పర్వేజ్ రసూల్‌లతో పాటు బుమ్రాకు కూడా మంచి విలువే దక్కింది.

 

 విదేశీయులపైనా కన్ను...

 గత ఐపీఎల్ వేలంతో పోలిస్తే ఈ సారి విదేశీ ఆటగాళ్లు ఎవరూ రికార్డు మొత్తాలను మూటగట్టుకోలేరు. అయితే టి20ల్లో చక్కటి నైపుణ్యం ఉన్న క్రికెటర్లపై వేలంలో ఆసక్తి కనిపించింది. దక్షిణాఫ్రికా దేశవాళీ టి20లో అత్యధిక వికెట్లు తీసిన హెండ్రిక్స్, బిగ్‌బాష్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన బెన్ డంక్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన కృష్మార్ సాంటోకిలకు ఐపీఎల్‌లో గుర్తింపు దక్కింది. మాడిసన్, డి కాక్, కూపర్, హెన్రిక్స్ ఈ జాబితాలోనివారే.  

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top