బెల్జియం Vs ఫ్రాన్స్‌: ఫైనల్‌ చేరేదెవరు?

France-Belgium gear up for a mega midfield battle in semi-finals - Sakshi

నేడు ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌  బెల్జియంతో ఫ్రాన్స్‌ ‘ఢీ’

రాత్రి గం 11.30 నుంచి సోనీ ఈఎస్‌పీఎన్

సోనీ టెన్‌–2, 3లలో ప్రత్యక్ష ప్రసారం

వేగంలో సమఉజ్జీలు... దాడుల్లో దీటైనవారు... రక్షణ శ్రేణిలో దుర్భేద్యులు... పోరాటంలో పోటాపోటీ! ప్రపంచ కప్‌ తొలి సెమీఫైనల్లో తలపడనున్న ఫ్రాన్స్‌– బెల్జియం జట్ల ప్రదర్శనను విశ్లేషిస్తే ఇలానే ఉంటుంది. అన్ని విభాగాల్లో ఢీ అంటే ఢీ అనేలా ఉన్న రెండింటి మధ్య ‘మాజీ చాంపియన్‌’ హోదా ఒక్కటే తేడా. 1998లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌... తర్వాత పడుతూ లేస్తూ ప్రయాణం సాగి స్తోంది. ఈసారి గ్రీజ్‌మన్‌ వంటి ఆటగాడికి ఎంబాపెలాంటి మెరిక తోడవడంతో ఆటతీరుతోపాటు జట్టు రాతే మారిపోయింది. లీగ్‌ దశలో సాధారణంగానే కనిపించినా నాకౌట్‌లో దుమ్ము దులిపేస్తోంది. ఇక 1986లో సెమీస్‌ చేరడమే ఈ మెగా టోర్నీలో బెల్జియంకు అత్యుత్తమం. ఇప్పుడు మాత్రం ముందునుంచి ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ సంచలనా త్మకంగా ఆడుతోంది. రొమేలు లుకాకు, ఈడెన్‌ హజార్డ్, డి బ్రుయెన్‌ల త్రయం ముందు ఎంతటి ప్రత్యర్థైనా వణకాల్సిందే. ఈ నేపథ్యంలో సెమీస్‌ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.  

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచ విజేతగా నిలవాలనే పంతంతో ఫ్రాన్స్‌! ‘గోల్డెన్‌ జనరేషన్‌’ ఆటగాళ్లతో ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కప్పు కొట్టలేమన్న పట్టుదలతో బెల్జియం! లీగ్‌ దశను అజేయంగా ముగించి, నాకౌట్‌లో ప్రత్యర్థులను పిండి చేసిన ఈ రెండు జట్లు మంగళవారం అర్ధరాత్రి ఇక్కడి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేడియంలో తొలి సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఏ ఒక్కరి ప్రదర్శన మీదనో ఆధారపడకుండా, దూకుడే మంత్రంగా ఆడుతూ, బలా బలాల్లోనూ సమతూకంతో కనిపిస్తున్నందున ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులకు మంచి పోరాటాన్ని వీక్షించే అవకాశం కలగనుంది. 

వీరి పోరాటం చూడండి...  డి బ్రుయెన్‌  కాంటె  
బ్రెజిల్‌తో క్వార్టర్స్‌లో 20 గజాల దూరం నుంచి బెల్జియం ఆటగాడు డి బ్రుయెన్‌ కొట్టిన గోల్‌ చూస్తే ఔరా అనాల్సిందే. కచ్చితమైన పాస్‌లు ఇతడి ప్రత్యేకత. మరోవైపు కాంటె... ప్రపంచంలో అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్‌. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం తన గొప్పతనం. మరి వీరిలో ఎవరు మిడ్‌ ఫీల్డ్‌లో మెరుస్తారో? 

లుకాకు (Vs) వరానె, ఉమ్టిటి 
టోర్నీలో నాలుగు గోల్స్‌ కొట్టడంతో పాటు సహచరులకు అవకాశాలు సృష్టిస్తున్నాడు బెల్జియం ఫార్వర్డ్‌ రొమేలు లుకాకు. మరోవైపు ప్రత్యర్థుల గోల్‌ అవకాశాలను నీరుగార్చడంలో ఫ్రాన్స్‌ సెంట్రల్‌ డిఫెన్స్‌ ఆటగాళ్లు వరానె, ఉమ్టిటి సిద్ధహస్తులు. క్వార్టర్స్‌లో ఉరుగ్వే స్టార్‌ సురెజ్‌ను వీరు కట్టిపడేశారు. ఈ ద్వయాన్ని దాటడం లుకాకుకు చిక్కుముడే.  

వెర్టాంగెన్‌(Vs) ఎంబాపె, గ్రీజ్‌మన్‌ 
బెల్జియం రక్షణ త్రయంలో కీలకం వెర్టాంగెన్‌. ఎడమ వైపున ఉండే ఇతడు డిపెండబుల్‌ ఆటగాడు. ఫ్రాన్స్‌ చిరుతలు గ్రీజ్‌మన్, ఎంబాపెలను నిలువరించడం తనకు పెద్ద పరీక్ష కానుంది. ఎంబాపె మిడ్‌ ఫీల్డ్‌ నుంచి వేగంగా పరిగెడుతూ ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాను ఎలా పడగొట్టాడో అందరూ చూశారు. ఇక గ్రీజ్‌మన్‌ గోల్‌ కొట్టాడంటే ఆ మ్యాచ్‌లో ఇప్పటిదాకా ఫ్రాన్స్‌కు పరాజయమన్నది ఎదురుకాలేదు. అనుభవజ్ఞుడైన వెర్టాంగెన్‌... ఈసారి గ్రీజ్‌మన్, ఎంబాపెలను ఎలా నిలువరిస్తాడో? 

హజార్డ్‌(Vs) పవార్డ్‌ 
ఈ టోర్నీలో అత్యుత్తమంగా ఆడుతున్నాడు బెల్జియం కెప్టెన్‌ ఈడెన్‌ హజార్డ్‌. దాడులతో పాటు చురుకైన కదలికలకు పెట్టింది పేరు. క్వార్టర్స్‌లో బ్రెజిల్‌ ఇతడి ధాటికి వెనుకంజ వేసింది. రైట్‌ బ్యాక్‌లో తనకు ఫ్రాన్స్‌ యువ కెరటం పవార్డ్‌తో పోటీ తప్పదు. 22 ఏళ్ల పవార్డ్‌... ప్రి క్వార్టర్స్‌లో అర్జెంటీనాపై కీలక సమయంలో గోల్‌ కొట్టాడు.  

లోరిస్‌(Vs) కోర్టొయిస్‌ 
ఆస్ట్రేలియాతో లీగ్‌ మ్యాచ్‌లో గోల్‌ ఇచ్చి విమర్శల పాలైన ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ హ్యుగో లోరిస్‌... తర్వాత తేరుకుని అడ్డుగోడలా మారాడు. ఉరుగ్వేపై అతడి ఆటే దీనికి నిదర్శనం. బెల్జియం పొడగరి కోర్టొయిస్‌... అగ్రశ్రేణి కీపర్‌. బ్రెజిల్‌తో క్వార్టర్స్‌లో నెమార్‌ షాట్‌ను కొనవేళ్లతో పైకి పంపి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు.  

సెమీస్‌ చేరాయిలా... ఫ్రాన్స్‌ 
►ఆస్ట్రేలియాపై 2–1తో గెలుపు 
►పెరూపై 1–0తో విజయం 
►డెన్మార్క్‌తో 0–0తో డ్రా 
►ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాపై 4–3తో విజయం 
►క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 2–0తో జయభేరి 

బెల్జియం
►పనామాపై 3–0తో గెలుపు 
►ట్యూనీషియాపై 5–2తో విజయం 
►ఇంగ్లండ్‌పై 1–0తో గెలుపు  
►ప్రి క్వార్టర్స్‌లో 3–2తో జపాన్‌పై విజయం 
►క్వార్టర్స్‌లో 2–1తో బ్రెజిల్‌పై జయభేరి 

హెన్రీ... నువ్వు సరైన పక్షాన లేవు 
బెల్జియం సహాయ కోచ్‌ థియరీ హెన్రీ ఫ్రాన్స్‌ ఒకనాటి మేటి ఫుట్‌బాలర్‌. కెప్టెన్‌ డెచాంప్స్, జినెదిన్‌ జిదాన్‌తో కలిసి 1998లో దేశానికి కప్‌ అందించాడు. ప్రస్తుతం బెల్జియం విజయాల్లో అతడి పాత్ర విస్మరించలేనిది. దీంతో హెన్రీని లక్ష్యంగా చేసుకుని ఫ్రాన్స్‌ వాగ్బాణాలు సంధిస్తోంది. అతడు సరైన పక్షాన నిలవలేదని ఎత్తిపొడుస్తోంది. మరో చిత్రమేమంటే... ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్‌–బెల్జియం చివరిసారిగా తలపడింది 1986లో. మూడో స్థానం కోసం సాగిన ఆ పోరులో ఫ్రాన్స్‌ 4–2 తేడాతో గెలుపొందింది. బెల్జియం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ జట్టుకిదే ప్రపంచకప్‌ అత్యుత్తమ ప్రదర్శన. తర్వాత 8 అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో బెల్జియం రెండింటిలో నెగ్గింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఫ్రాన్స్, బెల్జియం జట్లు 73 మ్యాచ్‌ల్లో ముఖాముఖీ తలపడ్డాయి. ఫ్రాన్స్‌ 24 మ్యాచ్‌ల్లో... బెల్జియం 30 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మరో 19 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top