టీమిండియా 24.. బుమ్రా 13

Fifth Most Wides Conceded By India After New Zealand Match - Sakshi

హామిల్టన్‌:  ఇవేమీ టీమిండియా, బుమ్రాలు సాధించిన అత్యుత్తమ గణాంకాలు కావు.. చెత్త గణాంకాలు. ప్రత్యేకంగా టీమిండియా, బుమ్రాలు నమోదు చేసిన వైడ్లు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మొత్తంగా 29 ఎక్స్‌ట్రాలు వేస్తే అందులో 24 వైడ్లు వేసింది.  మరి జస్‌ప్రీత్‌ అయితే ఏకంగా 13 వైడ్‌ బాల్స్‌ వేశాడు. అసలు వన్డే ఫార్మాట్‌ తమకు పరిచయం లేదన్నట్లు టీమిండియా బౌలింగ్‌ సాగితే,  ప్రధాన బౌలర్‌ అయిన బుమ్రా సైతం తానొక కొత్త బౌలర్‌ అన్న చందంగా బౌలింగ్‌ వేశాడు. టీమిండియా తాజా వైడ్ల చెత్త ప్రదర్శన జట్టు తరఫున ఐదో స్థానంలో నిలిచింది. 

1999లో కెన్యాతో బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 31 వైడ్లు వేస్తే, 2004లో ద ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 వైడ్లు వేసింది. 2007లో ముంబైలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 వైడ్లు వేసిన టీమిండియా.. అదే ఏడాది చెన్నైలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 వైడ్లు సమర్పించుకుంది. ఆ తర్వాత ఇదే భారత్‌ తరఫున అత్యధిక వైడ్లు సమర్పించుకున్న మ్యాచ్‌. గత కొంతకాలంగా ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌ కల్గిన జట్లలో ఒకటిగా ఉన్న భారత్‌ జట్టు ఇప్పుడు ఇటువంటి ప్రదర్శన చేయడం ఆందోళన కల్గించే అంశం. (ఇక్కడ చదవండి: మూడేళ్ల తర్వాత అయ్యర్‌-టేలర్‌!)

కాగా, 13 వైడ్లు వేసిన బుమ్రాపై నెటిజన్లు తమదైన శైలిలో పంచ్‌లు విసురుతున్నారు. అత్యుత్తమ బౌలర్‌ అయిన నువ్వే ఇలాంటి బౌలింగ్‌ వేస్తే మ్యాచ్‌ను ఎలా కాపాడుకుంటామంటూ ప్రశ్నిస్తున్నారు. ఓడిపోతామనుకున్న ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన బుమ్రా.. కివీస్‌కు తన బౌలింగ్‌ కారణంగానే మ్యాచ్‌ను ఇచ్చేశాడని విమర్శిస్తున్నారు. కివీస్‌తో మ్యాచ్‌లో షమీ 7 వైడ్లు వేస్తే, శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వైడ్లు, ఒక నోబాల్‌ వేశాడు. ఇక కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలు తలో వైడ్‌ వేశారు. లెగ్‌ బై రూపంలో మరో నాలుగు పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా వేసిన ఎక్స్‌ట్రాలు 29 అయ్యాయి. మరి న్యూజిలాండ్‌ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఆ జట్టు కూడా 27 ఎక్స్‌ట్రాలు ఇచ్చింది. అంటే మనకంటే రెండు తక్కువన్నమాట.

ఇది భారత్‌పై రెండో సక్సెస్‌ఫుల్‌ చేజింగ్‌
టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా న్యూజిలాండ్‌  ఒక రికార్డును నమోదు చేసింది. తన వన్డే చరిత్రలో అత్యుత్తమ ఛేజింగ్‌ను ఛేదించినట్లయ్యింది. అంతకుముందు  ఆసీస్‌పై 347 పరుగుల ఛేదనే ఇప్పటివరకూ కివీస్‌కు అత్యుత్తమంగా ఉండగా, తాజాగా దాన్ని బ్రేక్‌ చేసింది. 2007లో ఇదే సెడాన్‌ పార్క్‌లో ఆసీస్‌పై 347 పరుగుల టార్గెట్‌ను కివీస్‌ ఛేదించింది. ఇక భారత్‌పై ప్రత్యర్థి జట్టు చేసిన రెండో అత్యుత్తమ ఛేజింగ్‌గా ఇది నిలిచింది. 2019లో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 359 పరుగుల టార్గెట్‌ను ఛేదించగా, ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌ తాజా ఛేజింగ్‌ నిలిచింది. మరొకవైపు వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మూడో భారత స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ నిలిచాడు. నిన్నటి మ్యాచ్‌లో కుల్దీప్‌ 84 పరుగులు ఇచ్చాడు. అంతకుముందు 2008లో పాకిస్తాన్‌తో జరిగిన పీయూష్‌ చావ్లా 85 పరుగులు ఇచ్చి రెండో స్థానంలో ఉండగా,  2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చహల్‌ 88 పరుగులు ఇచ్చి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top