ఫ్రెంచ్‌ కిక్‌... 

fifa world cup 2018:France in the World Cup final - Sakshi

ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌

సెమీస్‌లో బెల్జియంపై  1–0తో గెలుపు

ఏకైక గోల్‌ చేసిన ఉమ్‌టిటి

అడ్డుగోడలా నిలబడిన ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ లోరిస్‌  

అసలు సమరంలో అనుభవమే గెలిచింది. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా సెమీస్‌ చేరిన బెల్జియం జట్టుకు మాజీ చాంపియన్‌ ఫ్రాన్స్‌ ఓటమి కిక్‌ ఇచ్చింది. దర్జాగా మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ తరఫున శామ్యూల్‌ ఏకైక గోల్‌ కొట్టి ఉండవచ్చు. ఈ ఒక్క గోల్‌తో ఫ్రాన్స్‌ గెలిచి ఉండొచ్చు. కానీ మ్యాచ్‌ను కంటికి రెప్పలా కాపాడింది మాత్రం కచ్చితంగా ఫ్రాన్స్‌ గోల్‌ కీపర్‌ హూగో లోరిసే.  సెమీస్‌ చరిత్రను చెరిపేందుకు బెల్జి యం ముందు నుంచీ కష్టపడింది. ఆ పడిన కష్టం... లోరిస్‌ ‘గోడ’ను దాటి వెళ్లలేకపోయింది. మ్యాచ్‌లో ఇదొక్కటే తేడా! ఈ తేడానే ఫ్రాన్స్‌ను ‘చాంపియన్‌’ బరిలో ఉంచితే... బెల్జియంను మూడో స్థానం పోరాటానికి పంపింది.  

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: ఫైనల్‌ దారిలో తొలి అడుగు పడింది. ఫ్రాన్స్‌ టైటిల్‌ వేటకు సిద్ధమైంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మూడోసారి ‘ఫైనల్స్‌’ అర్హత సంపాదించింది. బెల్జియం కథ మళ్లీ సెమీఫైనల్‌కే పరిమితమైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ 1–0 స్కోరుతో బెల్జియంపై విజయం సాధించింది. రెండో అర్ధభాగం మొదలైన కాసేపటికే శామ్యూల్‌ ఉమ్‌టిటి (51వ ని.) గోల్‌తో ఫ్రాన్స్‌ ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైంది. బెల్జియం ఆటగాళ్లు గోల్‌ ప్రయత్నంలో విఫలమైనా... బరిలో దిగినప్పటి నుంచి చివరిదాకా కష్టపడ్డారు. ఫ్రాన్స్‌కు దీటుగా స్ట్రయికర్లు లక్ష్యంపై గురిపెట్టారు. కానీ ఈ ప్రయత్నంలో గోల్‌పోస్ట్‌ చేరిన ప్రతీసారి ప్రత్యర్థి గోల్‌కీపర్‌ లోరిస్‌ కళ్లు చెదిరే విన్యాసాలతో అడ్డుకున్నాడు.  

ఆట ఆరంభం నుంచి బెల్జియం బంతిపై పట్టుసాధించే పనిలో పడింది. 15వ నిమిషంలో స్ట్రయికర్‌ హజర్డ్‌ చేసిన తొలి ప్రయత్నం విఫలం కాగా... 21వ నిమిషంలో లోరిస్‌ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా బెల్జియం బోణీ కొట్టేది. డిఫెండర్‌ అల్డర్‌విరెల్డ్‌ పెనాల్టీ బాక్స్‌లో కుడి వైపు నుంచి గోల్‌ పోస్ట్‌ ఎడమవైపు కొట్టిన మెరుపు షాట్‌ను లోరిస్‌ అంతే వేగంగా అద్భుతంగా డైవ్‌ చేస్తూ తప్పించాడు. మరోవైపు ఫ్రాన్స్‌ స్ట్రయికర్ల దాడుల్ని బెల్జియం గోల్‌కీపర్‌ కుర్టోయిస్‌ నిలువరించాడు. దీంతో గోల్‌ లేకుండా తొలి అర్ధభాగం ముగిసింది. ఆ తర్వాత ఆరు నిమిషాలకే ఫ్రాన్స్‌ విజయబావుటకు బీజం పడింది. 51వ నిమిషంలో ఫార్వర్డ్‌ గ్రీజ్‌మన్‌ కార్నర్‌ నుంచి కొట్టిన షాట్‌ను డిఫెండర్‌ ఉమ్‌టిటి హెడర్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఫ్రెంచ్‌ శిబిరం సంతోషంలో మునిగింది. 64వ నిమిషంలో బెల్జియం ఆటగాడు మెర్టెన్స్‌ ఇచ్చిన పాస్‌ను పెనాల్టీ బాక్స్‌లో ఉన్న అల్డర్‌విరెల్డ్‌ సూపర్‌ ఫాస్ట్‌గా తరలించేందుకు కొట్టిన హెడర్‌ షాట్‌ గురి తప్పింది. మళ్లీ 81వ నిమిషంలో హజర్డ్‌ స్టేడి యం సెంటర్‌ పాయింట్‌ నుంచి కొట్టిన లాంగ్‌ షాట్‌ను రెప్పపాటు సమయంలోనే లోరిస్‌ తప్పించాడు. బెల్జియం స్ట్రయికర్లు గురిపెట్టిన ప్రతీసారి లోరిస్‌ చాకచక్యంగా ఆపేశాడు.  

ఆధిక్యంలో ఇంగ్లండ్‌ 
క్రొయేషియాతో జరుగుతున్న ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆట మొదలైన ఐదో నిమిషంలోనే కీరన్‌ ట్రిపియర్‌ కళ్లు చెదిరేరీతిలో డైరెక్ట్‌ ఫ్రీ కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించడంతో ఇంగ్లండ్‌ ఖాతా తెరిచింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top