ఇంగ్లండ్‌ ప్లాన్‌ ప్రకారమే ఓడిందా..?

England Trying To Lose Against Belgium Says By Fans - Sakshi

ఓడిపోవడానికే పోరాడని ఇంగ్లండ్‌, బెల్జియం జట్లు

చివరకు బెల్జియంకు దక్కిన విజయం

మాస్కో : ఏ టోర్నీలోనైనా ఆడే ప్రతీ మ్యాచ్‌ గెలవాలని అన్ని జట్లు కోరుకుంటాయి. అందులోనూ ఫిఫా వంటి మెగా టోర్నీలో ప్రతీ మ్యాచ్‌ ఫైనల్‌ పోరును తలపిస్తూ ఉంటుంది. కాగా, లీగ్‌ దశలో బెల్జియంపై ఇంగ్లండ్‌ ఆడిన తీరు ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. ఆ జట్టు గెలుపు కంటే కూడా ఓటమి కోసం ఎక్కువ శ్రమించినట్లు కనబడుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఫిఫా ప్రపంచకప్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడకమందే ఇంగ్లండ్‌, బెల్జియం జట్లు నాకౌట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. గ్రూప్‌ జీలో టాప్‌ స్థానం కోసం గురువారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం1-0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌ రౌండ్‌16లోకి అడుగుపెట్టింది. అయితే ఇం‍గ్లండ్‌ జట్టు పక్కా గేమ్‌ ప్లాన్‌ ప్రకారమే బెల్జియంపై ఓడిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఇంగ్లండ్‌కు అన్ని అనుకూలిస్తే క్వార్టర్స్‌లో బలమైన బ్రెజిల్‌ ప్రత్యర్థిగా ఎదురయ్యే పరిస్థితులే ఎక్కువగా కన్పిస్తున్నాయి. 

దీనిలో భాగంగా సాంబా జట్టు నుంచి ముప్పు తప్పించుకోవడానికే బెల్జియంపై ఇంగ్లండ్‌ ఓడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఇంగ్లండ్‌ నాకౌట్‌లో కొలంబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిచినట్లయితే  మరో నాకౌట్‌ మ్యాచ్‌లో స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వార్టర్‌ ఫైనల్‌లో తలపడే అవకాశం ఉంటుంది.  బ్రెజిల్‌తో పోలిస్తే వీటి(స్వీడన్‌, స్విస్‌‌)పై గెలవటం సులభం అనే ఉద్దేశంతో బెల్జియం పై ఓడిపోయిందనేది విశ్లేషకుల వాదన.

బెల్జియంతో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఏ కేటగిరి ఆటగాళ్లను రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేయటంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.  ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించని ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సాదాసీదాగా ఆడి మ్యాచ్‌ను ఓటమితో ముగించారు.  మ్యాచ్‌లో పలుమార్లు గోల్‌ చేసే అవకాశాలు వచ్చినా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు పదే పదే మిస్‌ చేశారు. సాధారణంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోతే కోచ్‌ ఆగ్రహాన్ని చవిచూడటం పరిపాటి. అటువంటిది మ్యాచ్‌ అనంతరం ఇంగ్లండ్‌ కోచ్‌ ఆటగాళ్లను అభినందిస్తూ స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది. ఇక బెల్జియంకు కూడా ఇంగ్లండ్‌పై గొప్ప రికార్డేమి లేదు. 1936(82 సంవత్సరాల) తర్వాత ఇంగ్లండ్‌పై బెల్జియం గెలవడం ఇదే తొలిసారి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top