250 కూడా కాపాడుకోవచ్చు

England Obsessed To Reach 500 Before Anyone Else In World Cup  - Sakshi

అందరినీ ‘ఢీ’కొట్టించే టోర్నీ

ఇంగ్లండ్‌ క్లిష్టమైన ప్రత్యర్థి

కెప్టెన్ల భేటీలో కోహ్లి వ్యాఖ్య

లండన్‌: పుట్టింట జరిగే ప్రపంచకప్‌ కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే మెగా ఈవెంట్‌కు వారాల ముందు జరిగిన ఇంగ్లండ్, పాకిస్తాన్‌ సిరీసే అందరి కళ్లలో మెదులుతోంది. భారీ స్కోర్లతో భారమైన టోర్నీ జరుగుతుందని, 350 పరుగులు చేసినా గెలుపు ధీమా ఉండబోదనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం 250 పరుగులు కూడా కాపాడుకోవచ్చన్నాడు. ‘అతనిలో ఏమా ధీమా’ అనేలోపు అర్థవంతమైన వివరణ ఇచ్చాడు. మొదట్లో 300 అవలీలగా ఛేదించినా... మ్యాచ్‌లు జరిగే కొద్దీ పిచ్‌లు మారిపోతాయని విశ్లేషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గురువారం ఏర్పాటు చేసిన కెప్టెన్ల అధికారిక సమావేశంలో ఆట గురించి కెప్టెన్లంతా మాట కలిపారు. సన్నాహాలు మొదలు... ఎదురయ్యే సవాళ్లపై స్పష్టమైన సమాధానాలిచ్చారు. ఒకే ఫ్రేమ్‌లో జరిగిన సారథుల సమ్మేళనం సరదా సరదాగా సాగింది.  

ఆతిథ్య జట్టుతో కష్టం... 
భారత కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ.... వన్డే క్రికెట్‌లో ప్రస్తుత నంబర్‌వన్‌ జట్టు ఇంగ్లండ్‌తో కష్టాలు తప్పవన్నాడు. దీనికి సొంతగడ్డపై అనుకూలతలు అదనపు బలమని చెప్పాడు. ఇంకా అతనేమన్నాడంటే... ‘ఈ టోర్నీలో మేటి ప్రత్యర్థి ఏదైనా ఉంటే అది కచ్చితంగా ఇంగ్లండే. ఇక్కడి పరిస్థితులు, జట్టు ఫామ్‌ దృష్ట్యా దుర్బేధ్యమైన ప్రత్యర్థి ఇంగ్లిష్‌ జట్టు. అయితే ప్రపంచకప్‌ దాకా వచ్చిన జట్లన్నీ దేనికి తీసిపోవు. ఆడే జట్లన్నీ మెరుగైనవే! సమతూకంతో ఉన్న జట్లే బరిలో ఉన్నాయి. పైగా అందరూ అందరినీ ఢీకొట్టే టోర్నీ ఇది. నా దృష్టిలో అత్యంత రసవత్తరమైన ప్రపంచ
కప్‌గా ఈ టోర్నీ నిలుస్తుంది’ అని అన్నాడు. ఇంగ్లండ్‌ సారథి మోర్గాన్‌ స్పందిస్తూ... ప్రపంచ క్రికెట్లో 10 ఉత్తమ జట్లు తలపడే సమరమన్నాడు. ‘అసాధారణ పోటీ, అద్భుతమైన ఆటకు ఇది వేదిక. నాణ్యమైన క్రికెట్‌తో ఈ ప్రపంచకప్‌ సాగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మేమైతే బాగా సన్నద్దమయ్యాం. తొలి మ్యాచ్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ అని అన్నాడు. 

టైటిల్‌ నిలబెట్టుకుంటాం... 
ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా నిలబెట్టుకుంటుందని కంగారూ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ‘వార్నర్, స్మిత్‌ వచ్చాక మా జట్టు బలం పెరిగింది. వాళ్లిద్దరు జట్టుకు ఆయువుపట్టు. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. యాషెస్‌ ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ మాకు కీలకమైంది. జట్టుకో విధంగా ప్రణాళికలను అమలు పరుస్తాం. సరైన సమయంలో సరైన ఫలితాలకు ఈ వ్యూహాలే దోహదం చేస్తాయి’ అని ఫించ్‌ అన్నాడు. సఫారీ సారథి డు ప్లెసిస్‌ మాట్లాడుతూ... ప్రపంచకప్‌ గెలిపించిన తొలి దక్షిణాఫ్రికా  కెప్టెన్‌గా నిలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. నాలుగుసార్లు సెమీస్‌తో సరిపెట్టుకున్న జట్టు ఈసారి కప్‌ వేటలో విజయవంతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. బౌలర్లే తమ బలమని చెప్పుకొచ్చాడు. పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఇంగ్లండ్‌ తమకు అచ్చొచ్చే వేదికన్నాడు. ‘1992 ప్రపంచకప్‌ గెలిచాక... ఇంగ్లండ్‌లో జరిగిన 1999 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచాం. రెండేళ్ల క్రితం (2017) చాంపియన్స్‌ ట్రోఫీ కూడా సాధించాం. కాబట్టి ఈ ప్రపంచకప్‌లోనూ రేసులో ఉంటాం’ అని అన్నాడు.  

ఎవరైనా గెలవొచ్చు... 
నాలుగేళ్ల క్రితం ఫైనల్‌దాకా వచ్చి రన్నరప్‌తో సరి  పెట్టుకున్నామని... అప్పుడు ఆడిన అనుభవజ్ఞులు ఇప్పటి జట్టులోనూ ఉండటం కలిసొచ్చే అంశమని న్యూజిలాండ్‌ సారథి విలియమ్సన్‌ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆరోజు ఎవరైనా గెలవొచ్చు ఏదైనా జరగొచ్చని అభిప్రాయపడ్డాడు. ‘ర్యాంకింగ్, ఫేవరెట్స్, అండర్‌డాగ్స్‌ అనే కంటే ఆరోజు ఏ జట్టు సమతూకంగా ఉందో అదే గెలుస్తుంది’ అని అన్నాడు. క్వాలిఫయింగ్‌ నుంచి కష్టపడి మెగా ఈవెంట్‌కు అర్హత సంపాదించామని, ప్రతీ జట్టుతో ఆడటం గొప్ప అనుభవమని, ప్రపంచంలోని పది టాప్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయమని వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ అన్నాడు. ఇంగ్లండ్‌లో గతంలో తమకు మంచి అనుభవముందని శ్రీలంక సారథి దిముత్‌ కరుణరత్నే చెప్పాడు. ఇక్కడి పరిస్థితులకు చక్కగా అలవాటు పడాలనే తాము కాస్తా ముందుగానే ఇక్కడికొచ్చామని, ప్రస్తుతం జట్టు కూర్పు బాగుందని, శక్తిమేర రాణించేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని వివరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మేటి జట్లకు దీటుగా బదులిచ్చేందుకే ఇక్కడికి వచ్చామని అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌ చెప్పాడు. జూనియర్లు, సీనియర్ల కలబోతగా తమ జట్టు ఉందని... తమకు కలికొచ్చే రోజు ఎంతటి జట్టునైనా ఓడించే సత్తా తమకు ఉందని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మొర్తజా అన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top