క్రొయేషియా కొట్టేసింది

Croatia beat Russia 4-3 on penalties to reach semis - Sakshi

షూటౌట్‌లో గురి తప్పిన రష్యా

క్వార్టర్స్‌లో ఆతిథ్య జట్టు ఓటమి

రెండోసారి సెమీస్‌ చేరిన క్రొయేషియా

పోరు చివరిదాకా రసవత్తరంగా జరిగింది. ఆతిథ్య జట్టు ఆడుతుంది కాబట్టి ఫిష్ట్‌ స్టేడియం హోరెత్తింది. ఇరు జట్లు రెండు సార్లు సమవుజ్జీగా నిలిచాయి. నిర్ణీత సమయంలో రష్యా, క్రొయేషియా చెరో గోల్‌ చేశాయి. అదనపు సమయంలోనూ ఒక్కో గోల్‌ చేశాయి. 2–2తో స్కోరు సమం కావడంతో షూటౌట్‌ తప్పలేదు. రష్యా ఆటగాళ్లు వెనుకబడితే క్రొయేషియా 4–3తో మ్యాచ్‌ను, సెమీస్‌ చాన్స్‌నూ కొట్టేసింది.  

సొచి: రష్యా ఆడినంతసేపూ బాగా ఆడింది. ఈ క్వార్టర్‌ ఫైనల్లో క్రొయేషియా కంటే ముందే గోల్‌ చేసింది. అదనపు సమయం దాకా దీటుగా బదులిచ్చింది. అదనపు సమయం ఒక దశలో 2–1తో గెలుస్తుందనుకున్న క్రొయేషియాను చివరి నిమిషాల్లో గోల్‌ చేసి 2–2తో మళ్లీ నిలువరించింది. కానీ షూటౌటే ఆతిథ్య జట్టు కొంపముంచింది. ఇద్దరు ఆటగాళ్లు షూటౌట్‌ ఒత్తిడిలో చిత్తవడంతో చివరకు క్రొయేషియా 4–3తో విజయం సాధించింది. రష్యా తరఫున డెనిస్‌ చెరిషెవ్‌ (31వ ని.), మరియో ఫెర్నాండెస్‌ (115వ ని.) చెరో గోల్‌ చేయగా... క్రొయేషియా తరఫున అండ్రెజ్‌ క్రామరిక్‌ (39వ ని.), డొమగొజ్‌ విదా (100వ ని.) గోల్‌ చేశారు.

అయితే షూటౌట్‌లో రష్యా జట్టులో స్మొలొవ్‌తో పాటు ఫెర్నాండెస్‌ విఫలం కాగా జగొయెవ్, ఇగ్నాషెవిచ్, కుజియయెవ్‌ గోల్‌ సాధించారు. క్రొయేషియాలో మటే కొవసిక్‌ మినహా బ్రొజొవిక్, మోడ్రిక్, విదా, రకిటిక్‌ గోల్‌ చేయడంతో ఆ జట్టు సెమీస్‌ చేరింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో క్రొయేషియా తలపడుతుంది. ప్రపంచకప్‌లో క్రొయేషియా సెమీస్‌ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది.

ఆరంభం నుంచి రష్యా జాగ్రత్తగా ఆడింది. క్రొయేషియా స్ట్రయికర్లను నిలువరిస్తూ కదంతొక్కింది. బంతి చాలావరకు క్రొయేషియా ఆధీనంలోనే ఉన్నా... వారి దాడుల్ని గోల్‌పోస్ట్‌దాకా రానివ్వకుండా రష్యా అడ్డుకుంది. దీంతో అరగంట దాకా ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. ఆ మరుసటి నిమిషంలో రష్యా మిడ్‌ఫీల్డర్‌ చెరిషెవ్‌ (31వ ని.) పెనాల్టీ బాక్స్‌కు సమీపంలో 25 గజాల దూరం నుంచి కొట్టిన షాట్‌ గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. కానీ 8 నిమిషాల వ్యవధిలోనే క్రొయేషియా స్కోరు సమం చేసింది.రష్యా డిఫెండర్లను ఛేదిస్తూ మడ్జుకిచ్‌ ఇచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్‌ క్రామరిక్‌ (39వ ని.) హెడర్‌ గోల్‌గా మలిచాడు.

ద్వితీయార్ధంలో ఇరు జట్లు తమ దాడులకు పదును పెట్టినప్పటికీ ఎవరు సఫలం కాలేదు. బంతి పదేపదే క్రొయేషియా ఆధీనంలోకి వెళ్లినా... ప్రత్యర్థి లక్ష్యంపై గురిపెట్టడంలో రష్యా ఆటగాళ్లు కూడా ఆకట్టుకున్నారు. 13 షాట్లు ఆడిన రష్యా ఐదు సార్లు లక్ష్యంపై గురిపెట్టగా... క్రొయేషియా 18 షాట్లలో కేవలం మూడు సార్లు లక్ష్యం దిశగా ఆడింది. అదనపు సమయం మొదలైన పది నిమిషాలకు క్రొయేషియా తరఫున విదా (100వ ని.) హెడర్‌ గోల్‌ చేయగా, ఇక మ్యాచ్‌ ముగిసే చివరి క్షణాల్లో ఫెర్నాండెస్‌ (115వ ని.) కూడా హెడర్‌తోనే గోల్‌ చేసి రష్యాకు ఊపిరి పోశాడు. దీంతో 2–2తో స్కోరు సమం కావడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top