బంగ్లాదేశ్‌కు రవిశాస్త్రి సలహా | Bangladesh Need To Have A Strong Pace Attack Ravi Shastri | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌కు రవిశాస్త్రి సలహా

Nov 24 2019 7:29 PM | Updated on Nov 24 2019 7:29 PM

Bangladesh Need To Have A Strong Pace Attack Ravi Shastri - Sakshi

కోల్‌కతా:  బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత పేసర్లు చెలరేగిపోవడంపై ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం భారత పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌ ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తూ కొరకరాని కొయ్యగా తయారైందన్నాడు. ఇక్కడ వ్యక్తిగత ప్రదర్శనలు కంటే సమష్టిగానే పేసర్లు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లడంతోనే టీమిండియా సక్సెస్‌కు కారణమన్నాడు. వికెట్లను పడగొట్టాలనే కసి కారణంగానే భారత్‌ అద్భుతమైన విజయాలు సాధిస్తుందన్నాడు.

‘ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పేసర్లు చెలరేగిపోతున్నారు. దాంతోనే ఈ తరహా ఫలితాలు వస్తున్నాయి. మా పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌ కూడా ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్‌ యూనిట్లలో ఒకటిగా ఎదగడం మంచి పరిణామం. మా బౌలింగ్‌ యూనిట్‌ను చూసి డగౌట్లలో కూర్చొని ఉన్న మేము ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం. ఇందుకోసం చాలా సమయం పట్టింది. గత 15 నెలల నుంచి విదేశీ గడ్డపై చాలా క్రికెట్‌ ఆడాం. దాంతో మా వాళ్లు చాలా పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు అదే సత్ఫలితాల్ని ఇస్తుంది. పిచ్‌ పరిస్థితిని తొందరగా అర్థం చేసుకుంటున్నారు. పింక్‌ బాల్‌ టెస్టులో పిచ్‌ గతిని వెంటనే ఒడిసి పట్టుకున్నారు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇక పనిలో పనిగా బంగ్లాదేశ్‌కు కూడా రవిశాస్త్రి ఒక ఉచిత సలహా ఇచ్చాడు. ‘ మీరు విదేశాల్లో విజయాలు సాధించాలంటే బౌలింగ్‌ యూనిట్‌ను పటిష్టం చేసుకోవాలి. మీరు స్వదేశంలో తిరుగులేని జట్టు. కానీ విదేశీ పిచ్‌లపై రాణించాలంటే పటిష్టమైన పేస్‌ యూనిట్‌ను  తయారు చేసుకోవాలి. భారత్‌ తరహా పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌తో విదేశీ మ్యాచ్‌లకు సిద్దం కావాలి. మీరు పేస్‌ ఎటాక్‌లో బలపడితే మరింత మెరుగవుతారు. ముందు పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌ పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారించండి’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement