‘టాప్‌’ పథకంలోకి కోచ్‌ సియాదత్‌

Badminton Coach Siyadutt In Top - Sakshi

క్రీడాకారుల కోరిక మేరకు ‘సాయ్‌’ నిర్ణయం  

ముంబై: భారత బ్యాడ్మింటన్‌ అసిస్టెంట్‌ కోచ్‌ మొహమ్మద్‌ సియాదతుల్లాకు కూడా ఇక నుంచి టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం (టాప్‌) పథకం వర్తించనుంది. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, సమీర్‌ వర్మల కోరిక మేరకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) హైదరాబాద్‌కు చెందిన సియాదత్‌ను ‘టాప్‌’ పథకంలో చేర్చింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ముఖ్యమైన టోర్నీల్లో కోచ్‌ సియాదత్‌ తమతో ఉండటం ముఖ్యమని భావించిన ఈ ముగ్గురు ఆటగాళ్లు సియాదత్‌ను ‘టాప్‌’ పరిధిలోకి తీసుకురావాలంటూ ‘సాయ్‌’ని విజ్ఞప్తి చేశారు. సియాదత్‌తో పాటు ఫిజికల్‌ ట్రెయినర్‌ ఎస్‌ఆర్‌ గణేశ్‌కు ఈ పథకాన్ని వర్తింపజేయాలని పేర్కొన్నారు.

ఆటగాళ్ల వినతిపై సానుకూలంగా స్పందించిన సాయ్‌ సియాదత్‌ను టాప్స్‌లో చేర్చింది. ‘కోచ్‌ల బృందంలో సియాదత్‌      ముఖ్యమైనవాడు. గత రెండేళ్లుగా అతను మా గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ప్రతీ మేజర్‌ టోర్నీకి హాజరవ్వడం గోపీ సర్‌కు కుదరదు. దీంతో సియాదత్‌ ప్రతీ టోర్నమెంట్‌కూ మాతో పాటు ప్రయాణిస్తాడు. ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీల కోసం మేం ఈ ఏడాది  చాలా తిరగాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాతో పాటు కోచ్‌ ఉంటే బాగుంటుంది. అదే సమయంలో నిధులు కూడా అవసరం. కోచ్‌ సియాదత్‌కు ‘టాప్‌’ పథకం వర్తింపజేస్తే అతనితో పాటు మాకు మేలు జరుగుతుంది’ అని ప్రణయ్‌ పేర్కొన్నాడు. 35 ఏళ్ల సియాదత్‌ 2004 నుంచి పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో కోచ్‌గా పనిచేస్తున్నారు. 2010 నుంచి భారత జట్టు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top