టీమిండియాను ఎలా ఎదుర్కోవాలి? | Aussies to Prepare in Dubai For India Series | Sakshi
Sakshi News home page

టీమిండియాను ఎలా ఎదుర్కోవాలి?

Jan 2 2017 12:37 PM | Updated on Sep 5 2017 12:12 AM

టీమిండియాను ఎలా ఎదుర్కోవాలి?

టీమిండియాను ఎలా ఎదుర్కోవాలి?

గడిచిన ఏడాది వరుస విజయాలతో దూసుకుపోయిన భారత క్రికెట్ జట్టును కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రణాళికలు రచిస్తోంది.

మెల్బోర్న్:గడిచిన  ఏడాది వరుస విజయాలతో దూసుకుపోయిన భారత క్రికెట్ జట్టును కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే నెల్లో భారత్లో ఆస్ట్రేలియా పర్యటించనున్న నేపథ్యంలో ఆ జట్టు అప్పుడే కసరత్తులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి 'ఆట' ఏమిటో చూస్తాం? అంటూ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మైండ్ గేమ్కు తెరలేపాడు. ఆసీస్ కెప్టెన్ మాటలే భారత పర్యటనను ఆ జట్టు ఎంత సిరీయస్గా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు.

2016లో స్వదేశంలో జరిగిన సిరీస్ ల్లో భారత్ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్లను భారత్ కంగుతినిపించిన తరుణంలో తమ వ్యూహాన్ని మరింత మెరుగుపరుచుకునే ఇక్కడ అడుగుపెట్టాలని ఆసీస్ భావిస్తోంది. దీనిలో భాగంగా తొలుత దుబాయ్లోని ప్రాక్టీస్ పిచ్లపై ఆడాలని ఆసీస్ యోచిస్తోంది. ఈ రకంగా దుబాయ్లో కొంతవరకూ ప్రాక్టీస్ లభిస్తే, భారత్ లో పిచ్లపై ఆడటం సులభతరం అవుతుందని ఆసీస్ జట్టు అధికారుల భావనగా ఉంది.

2004 నుంచి భారత్ గడ్డపై సిరీస్ గెలవలేకపోయిన ఆసీస్.. 2013లో చివరిసారి భారత్ లో పర్యటించి ఆడిన నాలుగు టెస్టులను చేజార్చుకుంది మరొకసారి అది పునరావృతం కాకుండా ఉండాలంటే సమగ్రమైన ప్రణాళికతోనే భారత్ రావాలనుకుంటుంది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్న భారత్ను కట్టడి చేయాలంటే పూర్తిస్థాయి ప్రదర్శన అవసరం. ఆ క్రమంలోనే దుబాయ్లో ప్రాక్టీస్కు మొగ్గు చూపుతుంది. 'అన్ని చోట్ల భారత్ తరహా పిచ్లు ఉండవు. దుబాయ్లోని భిన్నమైన పిచ్లపై ప్రాక్టీస్ చేస్తే మాకు చాలా వరకూ ప్రిపరేషన్ లభిస్తుంది' అని ఆసీస్ జనరల్ మేనేజర్ పాట్ హోవార్డ్ పేర్కొన్నారు.

దుబాయ్ లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రూపొందించిన పిచ్లు చాలా బాగున్నాయంటూ ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం అక్కడ స్పిన్ పిచ్లే కాదు.. ఆ పిచ్లు చాలా వైవిధ్యంగా ఉంటాయంటూ కితాబిచ్చారు. దాదాపు దుబాయ్లో ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమైన ఆసీస్.. టీమిండియా మొత్తం జట్టుపై దృష్టి పెట్టింది. తమ టార్గెట్ రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు మాత్రమే కాదని, ఓవరాల్గా భారత్ జట్టును ఎలా కట్టడి చేయాలనే దానిపైనే వ్యూహరచన సాగుతుందని హోవార్డ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement