భళా...బార్టీ

Ashleigh Barty beats Marketa Vondrousova to win title - Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ హస్తగతం

46 ఏళ్ల తర్వాత  ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణి

రూ.18 కోట్ల 8 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

పారిస్‌: ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ బార్టీ 6–1, 6–3తో అన్‌సీడెడ్‌ మర్కెటా వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై ఘనవిజయం సాధించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ వొండ్రుసోవా నుంచి 23 ఏళ్ల బార్టీకి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఫైనల్‌ చేరే క్రమంలో ఒక్క సెట్‌ కూడా కోల్పోని 19 ఏళ్ల వొండ్రుసోవా కీలక పోరులో నాలుగు గేమ్‌లు మాత్రమే గెల్చుకోగలిగింది. ఈ విజయంతో యాష్లే బార్టీ 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

చివరిసారి 1973లో మార్గరెట్‌ కోర్ట్‌ ఈ వేదికపై ఆస్ట్రేలియాకు సింగిల్స్‌ టైటిల్‌ను అందించింది. తాజా గెలుపుతో బార్టీ సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంటుంది. 2011లో సమంత స్టోసుర్‌ (యూఎస్‌ ఓపెన్‌) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన ఆసీస్‌ ప్లేయర్‌గా బార్టీ నిలిచింది. ‘నమ్మశక్యంగా లేదు. నాకైతే మాటలు రావడంలేదు. ఫైనల్లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచాను. నా ఆటపట్ల నాకెంతో గర్వంగా ఉంది. గత రెండు వారాలు అద్భుతంగా గడిచాయి’ అని బార్టీ వ్యాఖ్యానిం చింది. విజేత బార్టీకి ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్‌ వొండ్రుసోవాకు 11 లక్షల 80 వేల యూరోలు (రూ.9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

నాదల్‌తో థీమ్‌ ‘ఢీ’
నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)తో నాలుగో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) తలపడనున్నాడు. రెండో సెమీఫైనల్లో థీమ్‌ 6–2, 3–6, 7–5, 5–7, 7–5తో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)ను ఓడించాడు. గతేడాది కూడా నాదల్, థీమ్‌ మధ్యే ఫైనల్‌ జరగ్గా... నాదల్‌ను విజయం వరించింది. నేటి ఫైనల్లో నాదల్‌ గెలిస్తే రికార్డుస్థాయిలో 12వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంటాడు. థీమ్‌ గెలిస్తే ఈ టోర్నీ ఫైనల్లో నాదల్‌ను ఓడించిన తొలి క్రీడాకారిడిగా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాకుండా 1995లో థామస్‌ ముస్టర్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్‌) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన ఆస్ట్రియా ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు.
యాష్లే బార్టీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top