మరో ఐపీఎల్!


 చాంపియన్స్ లీగ్‌కు మొదట్నించీ ఉన్న పేరు... మరో ఐపీఎల్. ఈ సీజన్‌లోనూ మళ్లీ అదే కనిపించింది. సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లలో మూడు ఐపీఎల్‌వే కావడంతో లీగ్‌కు విదేశాల్లో ఆదరణ తగ్గింది. 12 జట్లు పాల్గొంటే నాలుగు ఐపీఎల్ జట్లు బరిలోకి దిగడమే దీనికి ప్రధాన కారణం. ఈ టోర్నీకి బీజం వేసింది బీసీసీఐ కావడం, మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌లో క్రికెట్ మార్కెట్ పెద్దది కావడం, ఆదాయం కూడా ఇక్కడి నుంచే ఎక్కువ వచ్చే అవకాశం ఉండటం వల్ల ఐపీఎల్ జట్లకు ప్రాధాన్యత పెరిగింది. అయితే కేవలం ఐపీఎల్ జట్లు ఆడుతున్న మ్యాచ్‌లనే ప్రేక్షకులు చూస్తున్నప్పుడు దీన్ని ఒక ‘గ్లోబల్ టోర్నీ’గా భావించవచ్చా! మరి దీనికి, ఐపీఎల్‌కు తేడా లేనప్పుడు సీఎల్‌టి20 ప్రత్యేకత ఏముంటుంది?

 

 మిగిలిన మ్యాచ్‌లపై ఆసక్తి లేదు

 ఐపీఎల్ సూపర్ సక్సెస్ ఊపులో మరింత సొమ్ము చేసుకునేందుకు 2009లో లీగ్‌ను హడావిడిగా ప్రారంభించారు. అయితే టోర్నీ మొదలైననాటినుంచి కూడా ఇది అభిమానులకు చేరువ కావడంలో విఫలమైంది. ముఖ్యంగా విదేశీ జట్ల గురించి ఫ్యాన్స్‌కు పెద్దగా పరిచయం లేకపోవడం, ఐపీఎల్ తరహాలో సొంత మైదానంలో ఆడే అవకాశం ఇవ్వని లీగ్ షెడ్యూల్...తదితర కారణాలతో వారు లీగ్‌ను పట్టించుకోలేదు. ఈసారి కూడా... ధోని ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌లాంటిది తప్పితే తటస్థ అభిమానులకు చెప్పుకోదగ్గ వినోదం ఎక్కడా దక్కలేదు. నిజానికి ఒటాగో వోల్ట్స్, లయన్స్ మధ్య అద్భుతమైన టి20 మ్యాచ్ జరిగింది. డి కాక్, నీషామ్ చక్కటి ఆటతో పాటు సూపర్ ఓవర్ కూడా ‘టై’గా నిలిచే స్థాయిలో ఉత్కంఠభరితంగా సాగింది. అయితే భారత అభిమానుల్లో టోర్నీపై ఆసక్తి పెంచేందుకు ఈ ప్రదర్శన కూడా సరిపోలేదు.

 

 స్థాయి తక్కువ పోరు...

 ఈ సారి సీఎల్‌టి20లో జట్ల ఆట స్థాయి కూడా నాసిరకంగా ఉంది. క్వాలిఫయర్స్‌తో కలిసి మొత్తం 12 జట్లు బరిలోకి దిగాయి. ఇందులో నాలుగు జట్లు కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాయి. మరో రెండు జట్లు ఒక్కో విజయం సాధించాయి. అంటే ఆరు జట్లు కలిపి రెండే మ్యాచ్‌లు నెగ్గితే ఇక పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా కనీస పోటీ కూడా ఇవ్వలేని జట్లు ఆయా దేశపు అత్యుత్తమ టి20 టీమ్‌లంటే ఇంక పోటీ ఎక్కడ ఉంటుంది! ముఖ్యంగా ఐపీఎల్‌లో చెలరేగిపోయే విదేశీ ఆటగాళ్లు తమ స్వంత దేశపు జట్ల తరఫున కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. టీవీ ప్రేక్షకులు కొంత మేరకు మ్యాచ్‌లు చూసినా...వస్తున్న ప్రకటనలు చూస్తే స్పందన పెద్దగా లేదని అర్ధమవుతుంది. మైదానాల్లో అయితే ప్రేక్షకుల సంఖ్య మరీ పల్చగా ఉంది. ‘లీగ్‌తో అసలు ఎలాంటి సందడి లేదు. భారత్ బయట అయితే అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. పూర్తిగా టైమ్‌వేస్ట్ వ్యవహారం’ అని క్రికెట్ వీరాభిమాని అయిన ఒక బ్రాండింగ్ కంపెనీ సీఈఓ వ్యాఖ్యానించారు.

 

 మార్పులు చేస్తారా...

 ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి అందుకుంటుందని భావించి లీగ్‌కు అంకురార్పణ చేసిన నిర్వాహకులు తాజా పరిస్థితిని చూసి నిట్టూరుస్తున్నారు. లీగ్‌ను సక్సెస్ చేసేందుకు ఏం చేయాలనే దానిపై కసరత్తు మొదలైంది. ‘భారత్‌కంటే సీఎల్‌టి20కి దక్షిణాఫ్రికాలో ఎక్కువ ఆదరణ లభించింది. కాబట్టి దీనిని భారత్ బయట నిర్వహించడం, ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది జట్లనే ఆడించి నాకౌట్ తరహాలో టోర్నీ నిర్వహించడం తదితర మార్పులపై దృష్టి పెడుతున్నాం’ అని లీగ్‌తో సంబంధాలు ఉన్న ఒక అధికారి వెల్లడించారు. ఏదేమైనా కొత్త మార్పులతో ఆసక్తికరంగా మారితేనే చాంపియన్స్ లీగ్‌కు భవిష్యత్తులో మనుగడ ఉంటుందనేది ఖాయం.

 - సాక్షి క్రీడా విభాగం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top