స్పెయిన్‌ ఓటమి.. వెంటనే ప్లేయర్‌ రిటైర్మెంట్‌!

Andres Iniesta Retired After Spain Team Lose To Russia - Sakshi

మాస్కో : తమ జట్టు కనీసం క్వార్టర్స్‌ కూడా వెళ్లలేదన్న బాధతో మ్యాచ్‌ ఓడిన వెంటనే స్పెయిన్‌ స్టార్‌ ప్లేయర్ ఆండ్రెస్ ఇనీస్టా రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదని, ఎన్నటికీ ఈరోజును మరిచిపోలేనంటూ స్పెయిన్‌ మిడ్‌ ఫీల్డర్‌ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో 34 ఏళ్ల ప్లేయర్‌ ఆటకు వీడ్కోలు పలికాడు.

ఫిఫా వరల్డ్‌కప్‌ 2018లో భాగంగా ఆతిథ్య రష్యాతో జరిగిన మ్యాచ్‌లో 4-3 తేడాతో ఓడిపోయి స్పెయిన్‌ జట్టు ప్రపంచకప్‌ నుంచి నిష్ర్కమించింది. ‘నా జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ ఆడేశాను. మనం కలలు కన్న తీరుగా కెరీర్‌ను ముగించలేం. మా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. స్పెయిన్‌ జట్టు మరెన్నో సాధించాలని ఆశిస్తున్నానని’ ఆండ్రెస్‌ బాధతో మాట్లాడాడు. 2010లో ఫైనల్లో నెదర్లాండ్‌పై ఆండ్రెస్‌ గోల్‌చేసి స్పెయిన్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌ అందించిన క్షణాలను స్పెయిన్‌ అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు.  

ఈ ప్రపంచకప్‌లోనే స్పెయిన్‌ చేతిలో ఓడి గ్రూప్‌ దశలోనే జట్టు ఇంటిబాట పట్టడంతో ఇరాన్‌ ఆటగాడు సర్దార్‌ అజ్‌మౌన్‌(23) అతిపిన్న వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. అజమౌన్‌ తర్వాత ఫుట్‌బాల్‌ కెరీర్‌కు గుడ్‌ బై చెప్పిన ఆటగాడిగా స్పెయిన్‌ స్టార్‌ ప్లేయర్ ఆండ్రెస్ ఇనీస్టా నిలిచాడు. తమ జట్లను కనీసం క్వార్టర్స్‌కు కూడా తీసుకెళ్లలేదని, రిటైరవ్వాలంటూ అర్జెంటీనా, పోర్చుగల్‌ స్టార్‌ ఫుటాబాల్‌ ప్లేయర్లు లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆతిథ్య రష్యా మాత్రం అంచనాలను మించి రాణిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top